Ind W vs SL W T20 2024 :2024 మహిళల వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా మరో పోరుకు రెడీ అయిపోయింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బుధవారం శ్రీలంకతో తలపడనుంది. అయితే ఈ పోరులో టీమ్ఇండియా నామమాత్రంగా గెలిస్తే సరిపోదు, భారీ విజయం సాధించి నెట్రన్ రేట్ మెరుగుపర్చుకోవాలి.
సెమీస్‌కు కీలకం
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ 2 పాయింట్లు (-1.217 రన్‌రేట్)తో నాలుగో స్థానంలో ఉంది. టీమ్ఇండియా సెమీస్ రేస్‌లో ఉండాలంటే ఈ మ్యాచ్ అత్యంత కీలకం. శ్రీలంకతో మ్యాచ్ తర్వాత భారత్, డిఫెడింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొట్టాల్సి ఉంది. ఆ మ్యాచ్‌కు ముందు శ్రీలంకతో విజయం సాధిస్తే టీమ్ఇండియా ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. ఈ జోష్‌లో డిఫెడింగ్ ఛాంప్ ఆసీస్‌ను సైతం ఓడించవచ్చు. అలా రానున్న రెండు మ్యాచ్‌ల్లో అంచనాలు అందుకొని రన్‌రేట్ మెరుగుపర్చుకోవాలి.
బ్యాటింగ్ మెరుగుపడాలి
టీమ్ఇండియా గత మ్యాచ్‌లో పాక్‌పై నెగ్గినప్పటికీ మనోళ్ల బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేదు. స్వల్ప లక్ష్యాన్ని సైతం కష్టపడి ఛేదించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ ఇప్పటివరకూ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇకపై టోర్నీలో టీమ్ఇండియాకు ప్రతీ మ్యాచ్ కీలకం. అందుకే బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. అటు బౌలింగ్‌లోనూ ఫర్వాలేదనిపిస్తున్నా, ఇంకా రాణించాల్సిన అవసరం ఉంది.
తక్కువ అంచనా వేయలేం
ప్రస్తుత టోర్నీలో శ్రీలంక ఇంకా బోణీ కొట్టలేదు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి పట్టికలో అట్టగున నిలిచింది. అయితే నాణ్యమైన స్పిన్నర్లు ఉన్న లంకను తక్కువ అంచనా వేయడానికి లేదు. కెప్టెన్ చమరి ఆటపట్టునే లంకకు అతిపెద్ద బలం. తనదైన రోజున ఆటపట్టు చెలరేగిపోతుంది. బంతితోనూ అద్భుతాలు చేయగల చమరిని టీమ్ఇండియా సమర్ధంగా ఎదుర్కోవాల్సి ఉంది.
మనదే పైచేయి
శ్రీలంకతో ముఖాముఖి పోరులో భారత్‌దే పైచేయి ఉంది. అంతర్జాతీయ టీ 20ల్లో భారత్- శ్రీలంక ఇప్పటివరకు 25సార్లు తలపడ్డాయి. అందులో భారత్ ఏకంగా 19 మ్యాచ్‌ల్లో నెగ్గగా, లంక 5సార్లు విజయం సాధించింది. 1 మ్యాచ్ రద్దైంది. ఇక టీ20 వరల్డ్‌కప్‌లో 4 సార్లు తలపడగా టీమ్ఇండియానే 3 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఒక మ్యాచ్‌లో లంక విజయం సాధించింది.