IND vs PAK Test:క్రికెట్‌లో కొన్ని ఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇలా కూడా జరుగుతుందా? అనిపిస్తుంటాయి. సాధారణంగా ఏ ఆటగాడైనా ఒక సిరీస్ జరుగుతున్నప్పుడు మధ్యలోనే వైదొలిగితే దానికి గాయమో, వ్యక్తిగత సమస్యలో కారణం అవుతాయి. కానీ ప్రతిష్ఠాత్మకంగా భావించే భారత్- పాకిస్థాన్ టెస్టు సిరీస్ నుంచి ప్రత్యర్థి జట్టులోని ఓ క్రికెటర్ ఎవరూ ఊహించని కారణం చెప్పి వైదొలిగాడు. ఇది 70వ దశకంలో జరిగినా ఇప్పుడు ఆ వివరాలు వెల్లడి కావడం సంచలనంగా మారింది. భారత్‌లో జరిగిన ఆ సిరీస్‌లో తనపై చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ స్టార్ క్రికెటర్ మధ్యలోనే వైదొలిగాడని వెల్లడి కావడం హాస్యాస్పదంగా మారింది.
ఎప్పుడు జరిగిందంటే?
భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే సాధారణంగా హై ఓల్టేజ్ ఉంటుంది. ఈ ఇరుజట్ల మధ్య పోరును మ్యాచ్‌గా కాకుండా ఓ యుద్ధంలా చూసే అభిమానులు చాలామందే ఉంటారు. రాజకీయ వైషమ్యాలు, సరిహద్దుల్లో పాక్ దుందుడుకు చర్యలు ఈ దాయాదుల పోరును మరింత రసవత్తరంగా, ఉత్కంఠగా మార్చేశాయి. ఏడు దశాబ్దాలుగా క్రికెట్ మైదానంలో భారత్- పాక్ మధ్య పోరు ఇలాగే కొనసాగుతోంది. అయితే సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు.
కానీ, 1979- 80వ దశకంలో ఆరు టెస్టుల సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించింది. ఆసిఫ్ ఇక్బాల్ నాయకత్వంలో పాకిస్థాన్ జట్టు సునీల్ గవాస్కర్ నేతృత్వంలో భారత జట్టుతో పోటీపడింది. ఈ సిరీస్‌లో టీమ్ఇండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా కనిపించింది. ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో భీకర ఫామ్‌లో ఉండడం భారత జట్టు ఆ సిరీస్‌లో గెలవడం అసాధ్యంగా కనిపించింది. ఇమ్రాన్ ఖాన్‌కు అప్పట్లోనే భారత్‌లో అశేష అభిమానులు ఉండేవారు.
ఇక ఆ సిరీస్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్ మూలస్తంభం జహీర్ అబ్బాస్‌పై ఆ జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే అంతకుముందు పాక్‌లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో అబ్బాస్ 176, 235 పరుగులతో రాణించాడు. కానీ భారత్‌లో జరుగుతున్న ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో అయిదు మ్యాచ్‌లు ఆడిన జహీర్ అబ్బాస్ చివరి మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు.