IND VS NZ 2nd Test : ఓ వైపు లెక్క సరిచేయాలనే పట్టుదలతో టీమ్ ఇండియా, మరోవైపు సిరీస్ పట్టేయాలన్న ఆశలతో న్యూజిలాండ్, పుణెలో రసవత్తర సమరానికి సిద్ధమయ్యాయి. రెండు జట్ల మధ్య రెండో టెస్టు అక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది.
బెంగళూరు వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 46కే కుప్పకూలిన టీమ్ ఇండియా, రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్నప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. దీంతో ఎన్నో ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై సాధించిన విజయం ప్రత్యర్థి జట్టులో విశ్వాసాన్ని పెంచింది.
అలానే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై కన్నేసిన టీమ్ ఇండియాకు, ఆస్ట్రేలియా పర్యటన ముందు మిగిలిన రెండు టెస్టుల్లో విజయం సాధించడం ఎంతో ముఖ్యం. అయితే సొంత గడ్డపైనే భారత్ 0-1తో వెనుకబడడం చాలా అరుదు. అప్పుడెప్పుడో 2017లో ఆస్ట్రేలియాపై, 2021లో ఇంగ్లాండ్‌పై ఇలా వెనుకపడినప్పటికీ బలంగా పుంజుకుని సిరీస్‌ను దక్కించుకుంది. కాకపోతే అవి నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లు. అయితే ఇప్పుడు మూడు మ్యాచుల సిరీసే. కాబట్టి ప్రస్తుత సిరీస్‌లో జరగబోయే రెండూ మ్యాచుల్లోనూ గెలవాలి. ఈ గెలుపు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అర్హతకు కూడా ఎంతో ముఖ్యం.
ఏదేమైనా తొలి టెస్టులో పరాజయాన్ని అందుకున్నప్పటికీ రెండో టెస్ట్‌లో భారతే ఫేవరెట్. చూడాలి మరి మొదటి టెస్ట్‌లో అనూహ్యంగా విజయం సాధించిన కివీస్‌పై భారత జట్టు పుణె పిచ్‌పై ప్రతీకారం ఎలా తీర్చుకుంటుందో.