IND VS ENG Gill Injured :ఇప్పటికే సతమతమవుతున్న టీమ్ ఇండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. గాయాలతో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా జట్టుకు దూరమవ్వగా ఇప్పుడు అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న స్టార్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో గిల్ కుడి చూపుడు వేలికి గాయమైనట్లు తెలిసింది. ఓ వైపు చేతి వేలి నొప్పితో బాధపడుతూనే అతడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటాడు. అయితే ఇప్పుడా నొప్పి ఎక్కువ అవ్వడంతో నాలుగో రోజు ఫీల్డింగ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. "రెండో రోజు ఫీల్డింగ్‌లో శుబ్‌మన్ చేతి వేలికి గాయమైంది. అతడు నాలుగో రోజు ఫీల్డింగ్‌కు దూరంగా ఉండనున్నాటు" అని రాసుకొచ్చింది. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు దిగాడు. కాగా, ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అతడు 104 పరుగులు చేశాడు. అతడికిది కెరీర్‌లో మూడో టెస్టు శతకం. తన మూడో టెస్టు సెంచరీని అందుకోవడానికి గిల్‌కు 12 ఇన్నింగ్స్‌ల సమయం పట్టింది.
మళ్లీ అడుగు ఎప్పుడు పెడతాడో : అయితే గాయపడిన గిల్ మళ్లీ మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతాడో ప్రస్తుతానికి చెప్పలేం. గాయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అసలే అతడు గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో కొనసాగుతున్నాడు. మరీ ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. చివరి 10 ఇన్నింగ్స్‌లో ఒక్కసారి కూడా కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను టచ్ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు వైజాగ్ టెస్టులో మాత్రం సెంచరీతో(IND VS ENG Gill Century) సత్తా చాటాడు. 147 బంతుల్లో 104 పరుగులు చేసి తనపై విమర్శకులకు చెక్ పెట్టాడు. అతడి శతకంతోనే ఇంగ్లాండ్ ముందు టీమ్ ఇండియా 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కానీ అంతలోనే ఇప్పుడు అతడు గాయపడటం ఆందోళను కలిగిస్తోంది. ఇకపోతే నాలుగో రోజు లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబడుతూ ఆడుతోంది.