తెలంగాణ

telangana

ETV Bharat / sports

100వ టెస్ట్ : అతడు ఉంటే కెప్టెన్‌కు భరోసా - ప్రత్యర్థులకు హెచ్చరిక! - రవిచంద్ర అశ్విన్​ 100వ టెస్ట్

IND vs ENG Ravichandran Ashwin 100 Test : టీమ్ ఇండియా - ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లో ఆఖరిదైన ఐదో మ్యాచ్‌ టీమ్‌ఇండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్​కు ఎంతో ప్రత్యేకం. అతడికిది వందో టెస్టు కావడం విశేషం. ఈ ఘనత సాధించనున్న 14వ భారత ఆటగాడిగా అతడు నిలవనున్నాడు. ఈ సందర్భంగా అతడి గురించి ప్రత్యేక కథనం.

అతడు ఉంటే కెప్టెన్‌కు భరోసా - ప్రత్యర్థులకు హెచ్చరిక!
అతడు ఉంటే కెప్టెన్‌కు భరోసా - ప్రత్యర్థులకు హెచ్చరిక!

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 6:49 AM IST

IND vs ENG Ravichandran Ashwin 100 Test : అనిల్‌ కుంబ్లే రిటైరైపోయాడు. హర్భజన్‌ సింగ్‌ - కెరీర్‌ చరమాంకంలోకి వచ్చేశాడు. అయినా దశాబ్దాలుగా టీమ్ ఇండియాలో స్పిన్‌ బాధ్యతల్ని చక్కగా ముందుకు నడిపించేదెవరంటే వినపడే పేరు ఒక్కటే రవిచంద్ర అశ్విన్. కుంబ్లే, భజ్జీల స్థాయిని మరో ప్లేయర్ అందుకోగలరా? అని ప్రశ్నలు, సందేహాలు బాగా రేకెత్తిన సమయంలో టీమ్​ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ సత్తా చాటుతూనే ఉన్నాడు.

2011 నవంబరు 6న టెస్టు టోపీ అందుకున్నాడు అశ్విన్​. ఆ తర్వాత పన్నెండేళ్లలో టీమ్​ ఇండియా టెస్టు టీమ్​లోకి ఎందరో స్పిన్నర్లు వచ్చారు. వెళ్లిపోయారు. కానీ అతడు మాత్రం అసమాన్యమైన నిలకడతో రాణిస్తూ వందల కొద్దీ వికెట్లు తీస్తూ, లెక్కలేనన్ని రికార్డులతో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు వందో టెస్టు మైలురాయి చేరుకునేందుకు సిద్ధమయ్యాడు.

ప్రతీసారి కొత్త మెరుగులతో : ముందు అసలు అశ్విన్​ సాధారణ బౌలర్‌గానే అనిపించేవాడు. శైలి మరీ అంత ప్రత్యేకంగా అనిపించలేదు. బంతిని మరీ అంతగా తిప్పేవాడు కాదు. కానీ ఆ తర్వాత తనలోని ఒక్కో అస్త్రాన్ని బయటికి తీసి యుద్ధం మొదలపెట్టాడు. మేటి బ్యాటర్లనే ముప్పు తిప్పలు పెట్టే స్థాయికి ఎదిగిపోయాడు. ఆరు బంతులను ఆరు రకాలుగా వేయగలగడం అతడి స్పెషల్ టాలెంట్​. బంతిని మధ్య వేలితో పట్టుకుని క్యారమ్‌ బాల్​న సంధించాడంటే ప్రత్యర్థి బ్యాటర్లకు కఠిన పరీక్షే. పిచ్‌ కొంచెం స్పిన్‌కు సహకరించిందంటే వేరీ డేంజర్​గా మారిపోతుంటాడు. ప్రత్యర్థులు ఎలాంటి వారైనా సరే ఇక వికెట్లు పడగొట్టడమే అతడి పని. అయితే తన ప్రభావం తగ్గుతోందని అనుకున్న ప్రతిసారీ కొత్త మెరుగులతో, కొత్త అస్త్రాలు సిద్ధం చేసుకుని బరిలోకి వచ్చేస్తుంటాడు. జట్టుకు ఇప్పుడు వికెట్‌ తీయడం ఎంతో అవసరం అన్న సందర్భం వచ్చినప్పుడల్లా ఆపద్బాంధవుడు అయిపోతాడు. అసలు అతడు ఉన్నాడంటే చాలు భారత కెప్టెన్‌కు ఒక భరోసా. ప్రత్యర్థులకు అదొక హెచ్చరిక! అలా దశాబ్ద కాలంగా టీమ్​లో తన ప్రాధాన్యాన్ని నిలుపుకొంటూ వస్తున్నాడు.

అతనొక్కడే : అయితే టీ20ల ప్రభావం పెరిగాక ఆఫ్‌ స్పిన్నర్ల ప్రభావం బాగా తగ్గిపోయింది. మణికట్టు స్పిన్నర్లు, ఎడమచేతి వాటం బౌలర్లదే హవా కొనసాగుతోంది. బ్యాటర్లు ఆఫ్‌స్పిన్నర్ల శైలిని చదివేస్తూ అలవోకగా ఆడేస్తున్నారు. మిస్టరీ స్పిన్నర్లను సైతం ఈజీగా ఎదుర్కొంటన్నారు. దీంతో ఆఫ్‌స్పిన్నర్ల మనుగడ కష్టమవుతోంది. అజంత మెండిస్‌ సహా చాలా మంది ఆఫ్​ స్పిన్నర్లు లగేజీ సర్దేసుకున్నవారే. మరి ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్‌ గొప్పగా రాణిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఉపఖండంలో ఇప్పటికీ గొప్ప ప్రభావం చూపిస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నాడు. ప్రపంచ క్రికెట్లో అతడిలా ప్రత్యర్థులపై ఆధిపత్యం చలాయిస్తున్న ఆఫ్‌స్పిన్నర్‌ ఇంకొకరు లేరనే చెప్పాలి. ఎందుకంటే అతడెప్పుడు నిత్య విద్యార్థి. ఎప్పటికప్పుడు తన బౌలింగ్‌కు మెరుగులు దిద్ది, బ్యాటర్ల ఆలోచనలను చదివి వాళ్ల కన్నా ఒక అడుగు ముందే ఉంటున్నాడు. అందుకే ఇప్పటికీ నిలకడగా వికెట్లు తీస్తూ రాణిస్తున్నాడు.

రికార్డులు :

  • ఇక వందో టెస్టు ఆడకుండానే 500 వికెట్ల మార్క్​ను కంప్లీట్ చేసేశాడు అశ్విన్‌. ప్రస్తుత జరుగుతున్న ఇంగ్లాండ్‌ సిరీస్‌లో మూడో టెస్టులో ఈ ఫీట్​ను అందుకున్నాడు. అతడికిది 98వ టెస్టు కావడం విశేషం. ముత్తయ్య మురళీధరన్‌ మాత్రమే అశ్విన్‌ కన్నా తక్కువ మ్యాచ్‌ల్లో (87) ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.
  • సొంతగడ్డపై అశ్విన్‌కు తిరుగులేని రికార్డ్ ఉంది. 59 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 354 వికెట్లు తీశాడు.
  • అశ్విన్‌ సొంతగడ్డపై ఆడిన 59 మ్యాచ్‌ల్లో టీమ్​ ఇండియా 42 విజయాలను దక్కించుకుంది.
  • ఎడమ చేతి వాటం బ్యాటర్లపై అతడి మంచి రికార్డ్ ఉంది 252 లెఫ్ట్‌హ్యాండర్ల వికెట్లు తీశాడు. టెస్టు హిస్టరీలో ఏ బౌలర్‌ కూడా ఇంతమంది ఎడమ చేతి వాటం బ్యాటర్లను ఔట్‌ చేయలేదు.
  • టెస్టుల్లో అతడు పదిసార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులను ముద్దాడాడు. ఎనిమిదిసార్లు పది వికెట్ల ప్రదర్శన చేశాడు. 35 ఇన్నింగ్స్‌ల్లో అయిదు చొప్పున వికెట్లు తీశాడు.

కెరీర్లో మచ్చలేని బౌలర్లు- ఒక్క వైడ్​బాల్ వేయలేదు మరి!

WPL 2024 - ప్లేఆఫ్స్‌ ఆవకాశాలు ఏ జట్టుకు ఎలా ఉన్నాయంటే?

ABOUT THE AUTHOR

...view details