Ind vs Eng 3rd Test 2024:భారత్- ఇంగ్లాండ్ మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 326-5తో నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (131 పరుగులు), రవీంద్ర జడేజా (110* పరుగులు) సెంచరీలతో రాణించారు. టెస్టు కెరీర్లో రోహిత్‌కు ఇది 11వ సెంచరీ కాగా, జడేజాకు ఇది 4వ శతకం. అరంగేట్ర ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ (62 పరుగులు, 66 బంతుల్లో) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. క్రీజులో రవీంద్ర జడేజా (110), కుల్దీప్ యాదవ్ (1) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, టామ్ హర్ల్టీ 1 వికెట్ దక్కించుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0) స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యారు. ఇక మిడిల్లో వచ్చిన రజత్ పటీదార్ (5) మరోసారి విఫలమయ్యాడు. అతడు స్పిన్నర్ హార్ట్లీ బౌలింగ్‌లో క్యాచౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో రోహిత్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన రోహిత్- జడేజా స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 204 భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీ తర్వాత దూకుడు పెంచిన రోహిత్ 131 పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.