Ind Vs Eng 2024 Test Series : టీమ్‌ఇండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ - రవీంద్ర జడేజా ఓ అరుదైన మార్క్‌ను అందుకున్నారు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జోడీగా వీరు రికార్డు సాధించారు. అనిల్ కుంబ్లే - హర్భజన్ సింగ్ జోడీ సాధించిన రికార్డును వీరు అధిగమించారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అశ్విన్, జడేజా చెరో మూడేసి వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్నారు. దీంతో టెస్టుల్లో అశ్విన్ - జడేజా కలిసి 506 వికెట్లు తీసినట్లైంది. కేవలం 50 టెస్టుల్లోనే వీరిద్దరు కలిసి ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు వరకు అనిల్ కుంబ్లే - హర్భజన్ సింగ్ కలిసి 501 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. హర్భజన్-జహీర్ జోడీ 474 వికెట్లు, ఉమేశ్ యాదవ్ - అశ్విన్ కలిసి 431 వికెట్లు పడగొట్టారు.
ఇంటర్నేషనల్‌లో వారే : అయితే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్ - స్టువర్ట్ బ్రాడ్ ముందున్నారు. వీరిద్దరూ కలిసి 139 మ్యాచుల్లో 1,039 వికెట్లను తీశారు. కానీ బ్రాడ్ ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగా అండర్సన్ మాత్రం ఇంకా కొనసాగుతున్నాడు. అయితే ప్రస్తుతం టీమ్ఇండియాతో హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రం అండర్సన్‌కు తుది జట్టులో చోటు లభించలేదు. ఈ జోడీ తర్వాత ఆస్ట్రేలియా దిగ్గజాలు షేన్ వార్న్ - గ్లెన్ మెక్‌గ్రాత్ 104 మ్యాచుల్లో 1,001 వికెట్లు పడగొట్టారు.