Ind vs Ban 2nd Test :బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో నెగ్గిన టీమ్ఇండియా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు కూడా తొలి టెస్టుకు ఎంపిక చేసిన జట్టునే బీసీసీఐ ప్రకటించింది. అయితే తుది జట్టు (Playing 11) ఎలా ఉండనుంది అనేది ఆసక్తిగా మారింది. రెండో టెస్టుకు ఆతిథ్యమివ్వనున్న కాన్పూర్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఒక పేసర్‌ను బెంచ్‌కు పరిమితం చేసి కుల్దీప్ యాదవ్, ఆక్షర్ పటేల్ ఇద్దరిలో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
అయితే జట్టు కూర్పుపై అసిస్టెంట్ కోచ్ ఆభిషేక్ నాయర్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడాడు. లోకల్ బాయ్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉంటాడా అన్న మీడియా ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. కాన్పూర్‌లో పరిస్థితులు చాలా మారాయని, అందుకే తుది జట్టును ఇంకా ఎంపిక చేయలేదని తెలిపాడు. అయితే జట్టులో మార్పులు చేసేందుకు మాత్రం తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు
'తుది జట్టును ఇప్పుడే మీతో చెప్పలేను. జట్టులో ప్లేయర్లంతా అందుబాటులో ఉన్నారు. అయితే ఏ పిచ్‌పై ఆడనున్నామో ఇప్పటికీ క్లారిటీ లేదు. పిచ్ పరిస్థితులను బట్టే జట్టు కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా పరిస్థితులు చాలా మారిపోయాయి. రేపు ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని ఆశిస్తున్నాం' అని నాయర్ అన్నాడు. అయితే తొలి టెస్టులో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగిన టీమ్ఇండియా ఇప్పుడు ఆ కాంబినేషన్ మార్చే ఆలోచనలో ఉంది. ఈసారి ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లు జట్టులో ఉండే ఛాన్స్ ఉంది.