India Vs Australia Border Gavaskar Test : సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల తొలి రోజు ఆట ముగిసింది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 9 పరుగులు స్కోర్ చేసింది. మరో బంతి పడితే ఆట ఈ రోజు ముగుస్తుందనగా బుమ్రా అద్భుతమైన డెలివరీకి ఉస్మాన్ ఖవాజా (2) పెవిలియన్ బాట పట్టాడు. స్లిప్‌లో కేఎల్ రాహుల్ సూపర్ క్యాచ్ పట్టాడు. అయితే ఈ ఓవర్ వేస్తున్న సమయంలో బుమ్రాతో కొన్‌స్టాస్ (7*) వాగ్వాదానికి దిగబోయాడు. అయితే అంపైర్, ఖవాజా కలగజేసుకోవడంతో ఆ వివాదం కాస్త సర్దుమణిగింది. అయితే, చివరి బంతికి వికెట్ పడటం వల్ల టీమ్ఇండియా ప్లేయర్ల ఆనందం అంతా ఇంతా కాదు.
టీమ్ఇండియా తడబాటు - 185కే ఆలౌట్
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలో తడబాటుకు గురవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 72.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రిషభ్ పంత్ (40) మినహా మిగతా ఎవరూ మెరుగైన పెర్ఫామెన్స్ చేయలేకపోయారు. రవీంద్ర జడేజా (26), జస్‌ప్రీత్ బుమ్రా (22), శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లీ (17), వాషింగ్టన్ సుందర్ (14), యశస్వి జైస్వాల్ (10) తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. భారీ అంచనాలు పెట్టుకున్న నితీశ్ డకౌట్ కాగా, కేఎల్ రాహుల్ (4) కూడా ఆదిలోనే విఫలమయ్యాడు. ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4, మిచెల్ స్టార్క్ 3, కమిన్స్ 2, నాథన్ లైయన్ చెరో వికెట్ తీశారు.
మరోసారి అదే జరుగుతోంది
అయితే ఆస్ట్రేలియాతో వరుసగా ఐదో టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పటికీ టీమ్ఇండియా బ్యాటర్లలో ఏమాత్రం మార్పు లేదు. తమ వీక్నెస్లను బయటపెట్టుకుని విఫలమవుతూనే ఉన్నారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన యశస్వి జైస్వాల్ - కేఎల్ రాహుల్ క్రమక్రమంగా తమ ఫామ్‌ను కోల్పోయారు. స్టార్క్, బోలాండ్ బంతులకు వికెట్లను సమర్పించుకున్నారు. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ గైర్హాజరీలో బాధ్యతగా ఆడాల్సిన విరాట్ కోహ్లీ క్రీజ్‌లో నిలబడినప్పటికీ ఒకానొక దశలో తన బలహీనతను బయటపెట్టాడు. అయితే డకౌట్‌గా వెనుదిరిగాల్సిన సమయంలో అదృష్టం కలిసొచ్చినప్పటికీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు.