Ind vs Aus 4th Test 2024 :మెల్బోర్న్ టెస్టులో టీమ్ఇండియా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 310 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. భారత్ ఫాలో ఆన్ గండం తప్పించుకోవాలంటే మరో 111 పరుగులు చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్ (6), రవీంద్ర జడేజా (4) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
మెరుగైన స్థితిలో కనిపించినా
రెండో రోజు తొలి సెషన్లోనే టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (82 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించినా, కెప్టెన్ రోహిత్ శర్మ (3) మరోసారి తడబడ్డాడు. కేఎల్ రాహుల్ (24) కాసేపు ఆకట్టుకున్నా ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు. అయితే జైస్వాల్- విరాట్ మాత్రం క్రీజులో కుదురుకుపోయారు. వీరిద్ధరూ ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. మూడో వికెట్‌కు ఈ జోడీ 102 పరుగులు జోడించింది. దీంతో భారత్ రెండు వికెట్ల నష్టానికే 150 పరుగుల మార్క్ అందుకుంది.
కానీ, అక్కడే కథ మలుపు తిరిగింది. 41వ ఓవర్లో జైస్వాల్ రనౌట్ అయ్యాడు. దీంతో సెంచరీ భాగస్వామ్యం బ్రేక్ అయ్యింది. కొద్దిసేపటికే క్రీజులో పాతుకుపోయిన విరాట్ కూడా ఔటయ్యాడు. తర్వాత వరుస వికెట్లు పడుతున్న క్రమంలో నైట్‌వాచ్‌మెన్‌గా ఆకాశ్ దీప్ (0)ను బరిలో దింపినా అతడు కూడా పెవిలియన్ చేరాడు. దీంతో టీమ్ఇండియా 6 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది.