IND VD ENG Test Series 2024 Kohli : టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్‌లో విరాట్ కోహ్లీ ఉంటే అటు జట్టుకు ఇటు క్రికెట్ అభిమానులకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. టెస్టు ఫార్మాట్ విషయానికొస్తే ఇందులో అతడు చాలా ఏళ్లుగా నాలుగో స్థానంలో(సెకండ్ డౌన్) బ్యాటింగ్‌కు దిగి జట్టును విజయవంతంగా నడిపిస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడా స్థానంలో నిలకడగా ఆడే మరో ఆటగాడు దొరకడం లేదు. ఎవరైనా వచ్చి కుదురుకున్నారు అని అనుకునేలోపు ఏదో ఒక కారణంతో బయటకు వెళ్లిపోతున్నారు. దీంతో నాలుగో స్థానంలో ఎవరు? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది.
మరో కోహ్లీ కావాలి : కోహ్లీ టెస్టుల్లో నాలుగు స్థానంలోకి దిగి 145 ఇన్నింగ్స్‌ల్లో 7303 పరుగులు చేశాడు. అందులో 25 శతకాలు, 21 అర్ధ శతకాలు ఉన్నాయి. దీని ఆధారంగా అతడి ఆటతీరు ఎంత గొప్పగా ఉంటుందో చెప్పొచ్చు. అయితే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు అతడు వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేడు. దీంతో అతడి స్థానంలో ముగ్గురితో ప్రయత్నించింది మేనేజ్మెంట్. కానీ అందుకులో ఒకరు తప్ప మిగిలిన ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. దీంతో నాలుగో స్థానం కోసం మరో కోహ్లీ కావాలి అనే పరిస్థితి ఏర్పడింది.
ఆ ముగ్గురు ఎలా ఆడారంటే? : ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ దిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులతో ఆకట్టుకున్న అతడు రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులతో తెేలిపోయాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైపోయాడు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ వచ్చి రెండో టెస్ట్‌లో వరుసగా 27, 29 పరుగులతో బోల్తా పడ్డాడు. ఇక మూడో, నాలుగో టెస్టుకు కొత్త కుర్రాడు రజత్ పటీదార్‌ను తీసుకొస్తే అస్సలు ఏమంత ఆడలేకపోయాడు. 5, 0, 17, 0 అతడి స్కోర్.