WOMENS T20 WORLD CUP 2024 India Women vs New Zealand :టీ20 ప్రపంచ కప్ ఫేవరెట్లలో ఎప్పుడూ ఒకటిగా ఉంటుంది భారత జట్టు. అలానే ఈ సారి కూడా అమ్మాయిల టీ20 వరల్డ్ కప్‌లో బరిలోకి దిగిన భారత జట్టు టోర్నీని మాత్రం పేలవంగా ప్రారంభించింది. తన తొలి మ్యాచ్‌లోనే ఏకంగా 58 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో చిత్తైపోయింది.
కెప్టెన్ సోఫీ డివైన్ (36 బంతుల్లో 57; 7×4)తో పాటు ఓపెనర్ జార్జియా ప్లిమర్ (23 బంతుల్లో 34; 3×4, 1×6) రాణించడం వల్ల న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. భారత జట్టు బౌలర్లలో రేణుక సింగ్ (2/27), ఆశ శోభన (1/22), అరుంధతి రెడ్డి (1/28) వికెట్లు తీశారు.
ఇక ఛేదనలో మన అమ్మాయిలు తేలిపోయారు. రోజ్‌మేరీ మైర్ (4/19), లియా తహుహు (3/15), ఈడెన్ కార్సన్ (2/34)ల దెబ్బకు టీమ్ ఇండియా కుప్పకూలిపోయింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి 19 ఓవర్లలో 102 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిపోయింది. మన అమ్మాయిలలో హర్మన్ ప్రీత్ 15 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
మనోళ్లు ఎలా ఆడారంటే? - బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న భారత్ 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందని అంతా భావించారు. కానీ అంచనాలు తప్పాయి. భారత బ్యాటర్లు తేలిపోయారు. ఒక్కరూ క్రీజులో ఉండలేకపోయారు. పేలవ షాట్లు ఆడి చేతులెత్తేశారు.