Concussion Substitute Team India:కంకషన్ సబ్‌స్టిట్యూట్ అనే పదం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో భారత్ బౌలర్ హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ప్లేయర్ పెద్దగా ప్రభావం చూపకపోతే దాని గురించి పెద్దగా ఎవరూ మాట్లాడరు.
కానీ, అలా వచ్చిన హర్షిత్ ఇక్కడ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ అంశం చర్చనీయంగా మారింది. ఈ విషయంలో టీమ్ఇండియా సరైన విధానం పాటించలేదని ఇంగ్లాండ్ జట్టు అరోపణలు చేస్తోంది. మరి క్రికెట్లో కంకషన్ అంటే ఏంటి? అసలు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? గతంలో ఎవరెవరు దీన్ని వాడుకున్నారు? ఇలాంటి సందర్భాలు ఉన్నాయా? అనేవి తెలుకుందాం.
కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే ఏంటంటే?
క్రికెట్లో ఎప్పట్నుంచో సబ్‌స్టిట్యూట్ విధానం ఉంది. మ్యాచ్ మధ్యలో ఎవరైనా ఆటగాడు గాయపడితే అతడి ప్లేస్‌లో ఫీల్డింగ్ చేసేందుకు మాత్రమే ఛాన్స్ ఉండేది. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం లాంటి ఉదంతాలు, మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో ఐసీసీ కంకషన్ రూల్‌ను తీసుకొచ్చింది.
బ్యాటర్ హెల్మెట్, తల, మెడ భాగంలో బంతి తాకినప్పుడు తప్పనిసరిగా ఫిజియోలు వచ్చి పరిశీలించాలి. అలా గాయానికి గురైన ప్లేయర్ ఆట కొనసాగించలేని స్థితిలో ఉంటే, సబ్‌స్టిట్యూట్‌గా మరొకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం కల్పించింది. కంకషన్‌కు గురైన సదరు ప్లేయర్ అప్పటికే బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసి ఉన్నా సరే కొత్తగా వచ్చే ప్లేయర్ మళ్లీ మొదటినుంచి ప్రారంభించే వెసులుబాటు దక్కింది.
కానీ, కంకషన్‌కు గురైన సమయంలో సదరు బౌలర్‌పై నిషేధం ఉంటే మాత్రం కొత్తగా వచ్చేవారు బౌలింగ్ చేయడానికి అనర్హులు. ఈ రూల్‌ను పలు జట్లు ఇప్పటికే వినియోగించుకున్నాయి. ఈ లిస్ట్‌లో భారత్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా తాజాగా మరోసారి వాడుకుంది.
గతంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ సందర్భాలు
- ఈ కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్‌ను వాడుకోవడం టీమ్ఇండియాకు ఇదేమీ కొత్త కాదు. 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో రవీంద్ర జడేజా స్థానంలో భారత్ చాహల్‌ను కంకషన్ సబ్‌స్టిట్యూషన్‌గా బరిలోకి దించింది. ఆ మ్యాచ్‌లో చాహల్ 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అప్పుడు కూడా జడేజా స్పిన్ ఆల్‌రౌండర్ కాగా, చాహల్ స్పెషలిస్ట్ స్పిన్నర్.
- ఆస్ట్రేలియా కూడా ఈ రూల్‌ను వాడుకుంది. 2019 యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ తలకు బంతి తాకడం వల్ల బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో స్మిత్‌కు రిప్లేస్‌మెంట్‌గా ప్లేయర్ మార్నస్ లబుషేన్ వచ్చి, 59 పరుగులతో రాణించాడు. ఈ ఇన్నింగ్స్‌తో లబుషేన్ జట్టును ఓటమి నుంచి తప్పించాడు. అలా జట్టులోకి వచ్చిన లబుషేన్, ఇప్పుడు ఆసీస్‌కు కీలక ప్లేయర్‌గా మారిపోడు.
- 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఈ సబ్‌స్టిట్యూట్ రూల్‌ను వినియోగించుకుంది. వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పాక్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను రనౌట్ చేసే క్రమంలో తలకు గాయమైంది. అతడికి బదులు ఉసామా మిర్‌ను కంకషన్‌గా తీసుకుంది. తన తొలి ఓవర్‌లోనే వాన్‌డర్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియ్‌కు పంపాడు. అలా వరల్డ్‌కప్‌లో ఈ రూల్‌ను మొట్టమొదటగా పాక్ వాడుకుంది.
'మాకేం సంబంధం లేదు, అది వాళ్ల నిర్ణయమే!'- సబ్‌స్టిట్యూట్‌పై కోచ్ క్లారిటీ
టీ20 మ్యాచ్‌లో హర్షిత్ కాంట్రవర్సీయల్ డెబ్యూ! - ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?