ICC Champions Trophy 2025 :వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్, వేదికలపై చర్చించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నెల 29న వర్చువల్‌గా సమావేశం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉండగా, ఆ దేశం వెళ్లి ఆడేందుకు భారత్ నిరాకరిస్తోంది. 2008లో ముంబయిపై ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ భారత్ క్రికెట్ జట్టు పర్యటించలేదు. పాక్ వెళ్లకూడదనే భారత్ ప్రభుత్వ నిర్ణయంతో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారులో ఆలస్యం జరుగుతోంది.
ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని టీమ్ఇండియా కోరుతోంది. భారత్ ఆడే మ్యాచ్‌లు పాక్‌లో కాకుండా వేరే దేశంలో నిర్వహించాలని బీసీసీఐ కోరుతోంది. పాక్ బదులు యూఏఈలో ఆడేందుకు సిద్ధమని చెబుతోంది. అందుకు పాకిస్థాన్ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో నవంబర్ 29న జరిగే ఐసీసీ బోర్డు సమావేశం కీలకంగా మారింది. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా ఐసీసీ ఛైర్మన్‌గా డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇదిలా ఉండగా, కొత్త పాలక వర్గం బాధ్యతలు చేపట్టే ముందే ఛాంపియన్స్ ట్రోఫీపై ఒక నిర్ణయం తీసుకోవాలని జై షా సహా ఇతర సభ్యులు ఐసీసీపై ఒత్తిడి తెస్తున్నారు. చివరి నిమిషం వరకు ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్, వేదికలపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని వారు ప్రస్తుత కార్యవర్గంపై మండిపడుతున్నారు. మరోవైపు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరిస్తే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆర్థిక ప్రోత్సాకాలు ఇచ్చేందుకు కూడా ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిన ఆసియాకప్ కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరిగింది. పాకిస్థాన్‌లో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగాయి.