ICC Cancels Champions Trophy Tour : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రదర్శించిన అతి తెలివికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) సరైన బుద్ధి చెప్పింది! పాక్ ఆక్రమిత కశ్మీర్ (Pok) ప్రాంతంలో పాక్ నిర్వహించాలనుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను రద్దు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను పాకిస్థాన్ ప్రకటించిన వెంటనే ఐసీసీని బీసీసీఐ సంప్రదించడంతో వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. జై షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఐసీసీ టూర్‌ను రద్దు చేసింది!
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. ట్రోఫీ టూర్‌ను మాత్రం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే తొలుత పాకిస్థాన్‌కు కప్పును పంపింది. ఈ క్రమంలోనే తాజాగా పాక్ టూర్ షెడ్యూల్‌ను ప్రకటించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. నవంబరు 16న ఇస్లామాబాద్ నుంచి ఈ ట్రోఫీ టూర్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. అయితే షెడ్యూల్‌లో పీఓకేలోని(స్కర్దు, హుంజా, ముజఫరాబాద్) ప్రాంతాలను కూడా చేర్చి వక్రబుద్ధిని బయటపెట్టుకుంది పాక్ బోర్డ్.
- పరువు తీసుకున్న పాకిస్థాన్
ఉద్దేశపూర్వకంగా భారత్‌ను కవ్వించేందుకే పీఓకే ప్రాంతాలను చేర్చినట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాక్‌లో అడుగుపెట్టేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించాలన్న బీసీసీఐ ప్రతిపాదనను పాకిస్థాన్ తోసిపుచ్చింది. అటు భారత్, ఇటు పాక్ వెనక్కి తగ్గలేదు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఈ సమయంలో ట్రోఫీ టూర్ ప్లాన్ చేసిన పాక్ ఐసీసీ వద్ద మొట్టికాయలు తినింది. మరోసారి అంతర్జాతీయ వేదికలపై తన పరువు తానే తీసుకుంది.
- మరింత ఆలస్యం కానున్న షెడ్యూల్?
కొన్ని నివేదికల మేరకు, ఈ గందరగోళం మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మరింత ఆలస్యమవుతోందని తెలుస్తోంది. టోర్నీ నిర్వహణపై ఐసీసీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అలానే టీమ్ ఇండియా మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ చేసిన ప్రతిపాదనపై ఐసీసీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. లేదంటే నవంబర్ 11న టోర్నమెంట్ షెడ్యూల్‌ను ప్రకటించి ఉండేది.