Cricketer Harry Lee TEST DEBUT AFTER15 YEARS DEATH :నాగార్జున, సుమంత్ హీరోలుగా తెరకెక్కిన 'స్నేహమంటే ఇదేరా' సినిమా మీకు గుర్తుంది కదా. అందులో సుమంత్ ఆర్మీకి వెళ్తారు. అక్కడ జరిగిన ఓ యుద్ధంలో సుమంత్ మరణించినట్లు అతడి కుటుంబ సభ్యులకు వార్త వస్తుంది. తీరా కొన్నేళ్ల తర్వాత సుమంత్ ఇంటికి తిరిగి వస్తారు. అచ్చం అలాంటి ఘటనే ఓ క్రికెటర్ విషయంలోనూ జరిగింది. దీంతో అతడు మరణించిన 15 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేయాల్సి వచ్చింది! అసలేం జరిగిందంటే?
ఇష్టం లేకపోయినా సైన్యంలోకి! - క్రికెటర్ హ్యారీ లీ 1890వ సంవత్సరంలో ఇంగ్లాండ్‌లో జన్మించాడు. అతడికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తనకు ఇష్టం లేకపోయినా హ్యారీ అనుకోకుండా మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా హ్యారీ క్రికెట్ ప్రాక్టీస్‌లోనే బిజీగా ఉండేవాడు. అతడు 'మిడిల్ సెక్స్' టీమ్ తరఫున లీ లార్డ్స్ గ్రౌండ్లో తొలి సెంచరీ(139) చేసిన కొన్నాళ్లకే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.
ప్రమాదంలో కన్నుమూశాడని వార్తలు! -లండన్ రెజిమెంట్‌లో భాగమైన 13వ బెటాలియన్‌లో చేరాడు హ్యారీ లీ. కొన్ని నెలలపాటు శిక్షణ పొందిన తర్వాత 1915 ఫిబ్రవరిలో ఆయన విధుల్లో చేరాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ వెళ్లాడు. అక్కడ జర్మనీ జరిపిన దాడిలో వందలాది బ్రిటిష్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అందులో హ్యారీ లీ కూడా ఉన్నారని, ఆయన కుటుంబానికి మరణవార్త వెళ్లింది. దీంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే వాస్తవానికి లీ కన్నుమూయలేదు. తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడి జాడ కనిపించకపోవడం వల్ల, హ్యారీ మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. కానీ ఆ తర్వాత హ్యారీ జర్మనీ జరిపిన దాడి నుంచి బయట పడినట్లు తెలిసింది. అతడి చనిపోలేదని నిర్ధరణ అయింది. అతడు ఫ్రాన్స్‌లోని ఓ ఆస్పత్రిలో కొంత కాలం పాటు చికిత్స తీసుకుని బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.