Harbhajan Singh On Selectors :టీమ్ఇండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్, బీసీసీఐ సెలక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. రంజీల్లో ప్రదర్శన కాకుండా ఐపీఎల్లో పెర్ఫార్మెన్స్ ఆధారంగా జాతీయ జట్టుకు ఎంపిక చేస్తున్నారని ఫైర్ అయ్యాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన జలజ్ సక్సెనా రంజీల్లో 6వేల పరుగులు, 400 వికెట్లు పడగొట్టినా, కనీసం టీమ్ఇండియా Aలో చోటు దక్కకపోవడంతో డొమెస్టిక్ క్రికెట్ వల్ల లాభమేంటని భజ్జీ అన్నాడు. ఈ క్రమంలోనే రంజీల్లో ఆడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని షాకింగ్ కామెంట్ చేశాడు.
అయితే ప్రస్తుత రంజీ ట్రోఫీలో మధ్య ప్రదేశ్ ప్లేయర్ జలజ్ సక్సేనా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అతడు రీసెంట్ మ్యాచ్‌తో రంజీల్లో 6వేల పరుగులు, 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో లిస్ట్ ఎ కెరీర్లో ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా సక్సెనా రికార్డు సృష్టించాడు. అయితే గత కొన్నేళ్లుగా రంజీ, డొమెస్టిక్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా అతడ్ని టీమ్ఇండియా సెలక్టర్లు పక్కనపెడుతున్నారని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
'జలజ్ సక్సెనా రంజీల్లో 400 వికెట్లు, 6000 పరుగులు పూర్తి చేశాడు. భారత డొమెస్టిక్ టోర్నీల్లో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడు సక్సెనా. కానీ, అతడు టీమ్ఇండియాకు ఆడడానికి మాత్రం ఈ ప్రదర్శన సరిపోవడం లేదు. అది ఒక ఛాంపియన్ ప్లేయర్ పెర్ఫార్మెన్స్. అంతకన్నా అతడు ఇంకా ఎం చేయగలడు?' అని ట్విట్టర్లో నెటిజన్ షేర్ చేశారు. దీనికి భజ్జీ స్పందించాడు. 'మీతో ఏకీభవిస్తున్నాను. అతడిని కనీసం ఇండియా ఎ తరుఫున ఎంపిక చేయాడానికైనా పరిగణించాలి. కానీ, రంజీల్లో ఆడడం ఉపయోగం లేకుండా పోయిందా? ఇప్పుడు ఐపీఎల్ ప్రదర్శనలు చూసి ఎంపిక చేస్తున్నారు' అని రిప్లై ఇచ్చాడు.