Harbajan Singh About Virat Kohli Captaincy :టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. టెస్టుల్లో జట్టును కోహ్లీ నడిపించిన విధానం అద్భుతమని కొనియాడాడు. విదేశీ గడ్డపైనా గెలవాలనే కసిని టీమ్ఇండియా ఆటగాళ్లలో పెంచాడని పేర్కొన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బోర్డర్ - గావస్కర్ 2021-22 ట్రోఫీ అని వివరించాడు. ఇప్పుడు ఆటగాడిగానూ అదే దూకుడు కొనసాగించడం అభినందనీయమని అభిప్రాయపడ్డాడు. ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ నాయకత్వంపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
'ఆయన గొప్ప నాయకుడు కాకుండా పోడు'
అలాగే టీమ్ ఇండియాలో కింగ్ కోహ్లీ పోరాటపటిమను నింపాడని భజ్జీ కొనియాడాడు. తన కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ ట్రోఫీ లేనంత మాత్రాన గొప్ప నాయకుడు కాకుండా కోహ్లీ పోడని అభిప్రాయపడ్డాడు. "కోహ్లీ సారథ్యంలో భారత్ ఐసీసీ ట్రోఫీగానీ, వరల్డ్ కప్ గానీ గెలవలేదు. అయితే అదేమీ అతడిని అద్భుతమైన నాయకుడిగా పిలవకుండా ఆపలేదు. జట్టులో విజయం సాధించాలనే కాంక్షను కోహ్లీ రేకెత్తించాడు. రెండో ఇన్నింగ్స్ లో దాదాపు 400 పరుగుల టార్గెట్ ను ఛేదించడమంటే సాధారణ విషయం కాదు. అలాంటప్పుడు ఎలాంటి ఆందోళన లేకుండా టీమ్ ఇండియా విజయం సాధించిందంటే దానికి కారణం కెప్టెన్ గా ఉన్న కోహ్లీ. జట్టులోని ప్రతి క్రికెటర్ కూ అలాంటి గట్స్ ను నేర్పించాడు. గబ్బాలో శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ఆడిన తీరు ఎప్పటికీ మరువలేం. అప్పట్నుంచే భారత జట్టు ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. విదేశాల్లోనూ టీమ్ ఇండియాను చూస్తే ప్రత్యర్థులు హడలెత్తేలా చేయడంలో కోహ్లీ విజయవంతం అయ్యాడు. " అని హర్భజన్ వ్యాఖ్యానించాడు.
కెరీర్ పరంగా
కాగా, 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన కింగ్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 27వేలకు పైగా పరుగులు చేశాడు. అందులో 114 టెస్టుల్లో కింగ్ కోహ్లీ 8871 రన్స్ చేశాడు. అందులో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 295 వన్డేల్లో 13,906 పరుగులు సాధించాడు. అందులో 50 శతకాలు, 72 అర్ధ శతకాలు ఉన్నాయి. 125 టీ20ల్లో 4,188 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, టీ20లకు కింగ్ కోహ్లీ ఇటీవలే గుడ్ బై చెప్పాడు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు.