Gautam Gambhir World Cup :టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తాజాగా ఎమోషనలయ్యారు. 1992లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్ స్టేజ్‌లోనే ఇంటి ముఖం పట్టడాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో తాను తీవ్రంగా ఏడ్చానంటూ గుర్తుచేసుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు తనకు 11 ఏళ్ల వయసని, అప్పుడే తాను టీమ్ఇండియా ఓటమిని తట్టుకోలేక రాత్రంత ఏడ్చానంటూ తెలిపాడు. ఆ క్షణమే ఎలాగైనా టీమ్ఇండియాకు వరల్డ్ కప్ అందించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు.
" బ్రిస్బన్ వేదికగా జరిగిన 1992 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. అది చూసి నేను ఆ రోజు రాత్రంతా ఏడ్చాను. అంతకుముందు కానీ, ఆ తర్వాత కానీ నేను అంతలా ఏడ్చిన సందర్భాలు లేవు. నేను ఆ రోజు ఎందుకు అలా ఏడ్చానో కూడా తెలీదు. అప్పుడు నా వయసు కేవలం 11 ఏళ్లు మాత్రమే. అప్పుడే నేను భారత్ కోసం ప్రపంచకప్ గెలవాలని బలంగా ఫిక్స్ అయ్యా. ఆ కల 2011లో తీరింది.'అని గంభీర్ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు.
ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 9 వికెట్లకు 237 పరుగులు చేసింది. వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్దతితో నిర్ణయించగా, 47 ఓవర్లలో 235 పరుగుల మాత్రమే చేయగలిగారు. అయితే భారత్ మాత్రం సరిగ్గా 234 పరుగులు చేసి ఓటమిపాలైంది.