Gautam Gambhir Love Story :టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా మాజీ క్రికెట్ గౌతమ్ గంభీర్ తాజాగా ఎంపికయ్యారు. తన క్రికెట్ కెరీర్లో టీమ్ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఈ స్టార్ క్రికెటర్, 2011 వరల్డ్ కప్ గెలుపులోనూ కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు మెంటర్‌గానూ కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే మైదానంలో అతడు చాలా వరకు సీరియస్‌గానే కనిపిస్తాడు. కానీ ఈ సీరియస్ మ్యాన్ లైఫ్‌లో ఓ సూపర్ లవ్ స్టోరీ ఉంది. ఔనండి గౌతమ్ గంభీర్‌ది లవ్ మ్యారేజ్. అయితే తన లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్ట్‌లు ఉన్నాయట. అవేంటంటే?
గౌతమ్ గంభీర్, నటాషా జైన్ 2007లో ఓ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయినా ఈ విషయాన్ని వారిద్దరూ బయటకు చెప్పలేదు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న సమయమది. అలాగే నటాషా కూడా తన కెరీర్ ఫోకస్ పెట్టారు. అలా ఈ జంట కొన్నాళ్ల పాటు తమ కెరీర్‌పై ఫోకస్ పెడుతూనే తమ లవ్ లైఫ్‌ను ఆస్వాదించారు.
పెళ్లికి ముందు ప్రేయసికి కండీషన్
కొన్నేళ్ల డేటింగ్ తర్వాత ఈ ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకున్న ఏడాది తర్వాత అంటే 2011 అక్టోబరు 29న గౌతమ్- నటాషా సన్నిహితుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
అయితే, నటాషాతో పెళ్లికి ముందు గౌతమ్ ఆమెకు ఒక షరతు పెట్టారట. కెరీర్ ఇప్పుడు ఉత్తమ దశలో ఉంది కాబట్టి 2011 వరల్డ్ కప్ అయిన తర్వాతనే ఆమెను వివాహం చేసుకుంటానని నటాషాతో అన్నారట. దానికి ఆమె కూడా ఓకే చెప్పారట. ఇక ఆ మాటను నిలబెట్టుకుంటూ వరల్డ్ కప్ తర్వాత గంభీర్ నటాషాను పెళ్లాడారు.