Former Indian cricketer Vinod Kambli Health Condition:టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆయన నడవలేని స్థితిలో ఉన్నారంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వైరల్ వీడియో చూసిన ఆయన చిన్ననాటి మిత్రులు ఆందోళన చెంది గురువారం వినోద్ ఇంటికెళ్లారు. అయితే వినోద్ కాంబ్లీ దీనిపై స్పందిచారు. అందతా అబద్దపు ప్రచారం అని స్నేహితులతో చెప్పారు. ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నానని సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మోద్దని కాంబ్లీ అన్నారు.
అయితే భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై ఆందోళన కలిగించే వీడియో ఒకటి ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ చిన్ననాటి స్నేహితుడైన కాంబ్లీ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకా ఈ వైరల్ వీడియోలో కాంబ్లీ నడవడానికి కూడా ఇతరులపై ఆధారపడటం కనిపించింది.
వీడియోలో, వినోద్ కాంబ్లీ తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టంగా కనపడుతోంది. ఈ వీడియోను నరేంద్ర గుప్తా అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అప్‌లోడ్ చేశాడు. ఆయన ఓ పోస్ట్‌లో కాంబ్లీ పరిస్థితిని వివరించారు. ‘మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం సరిగా లేదు. కాంబ్లీ ఇటీవలే తన ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఆయన గుండె సమస్యలు, డిప్రెషన్ సహా అనేక ఆరోగ్య సమస్యలతో చాలాసార్లు ఆసుపత్రిలో చేరారు. ఆయన త్వరగా కోలుకుంటారని, ఆయనకు అవసరమైన సపోర్ట్ లభిస్తుందని ఆశిస్తున్నాను!’ అని పేర్కొన్నారు.
2013లో గుండెపోటు
వినోద్ కాంబ్లీ చాలా సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. 2013లో గుండెపోటు రావడంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, అతడు మరోసారి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.