Virat Kohli IPL Records:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన లీగ్ దశను దాటుకుని ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. తొలి 8 మ్యాచ్‌లలో ఒక్కటే గెలిచినా, ఆ తర్వాత జరిగిన ఆరు మ్యాచ్‌లలో వరుస విజయాలు నమోదు చేసి, ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ 4 స్థానం దక్కించుకుంది. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ జట్టును ఈ స్థాయికి చేర్చిందనడంలో సందేహం లేదు.
ఐపీఎల్ 2024లో 14 మ్యాచ్‌లలో 708 పరుగులు చేసిన కోహ్లీ ఆరెంజ్ క్యాప్‌తో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అందులో ఐదు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉన్నాయి. వీటిని బట్టే తెలుస్తుంది కదా విరాట్ బెంగళూరు బ్యాటింగ్ విభాగానికి వెన్నెముక లాంటోడని, ప్రతి మ్యాచ్‌లో నిలకడైన బ్యాటింగ్ తీరు ఆర్సీబీకి కలిసొస్తుంది.
ఈ సీజన్‌లో దూకుడుగా సాగిపోతున్న విరాట్‌ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఐపీఎల్లో ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు బాదిన ప్లేయర్‌గా విరాట్ కొనసాగుతున్నాడు. 2016లో విరాట్ 973 పరుగుల చేశాడు. ఐపీఎల్ చరిత్రలో సింగిల్ సీజన్‌లో ఓ బ్యాటర్ బాదిన అత్యధిక పరుగులు ఇవే.
కాగా, ప్రస్తుత సీజన్‌లో కోహ్లీ ఇప్పటివరకు 708 పరుగుల చేశాడు. తన సొంత రికార్డ్ బ్రేక్ చేయాలంటే మరో 266 పరుగులు సాధించాల్సి ఉంది. అయితే ఆర్సీబీ టైటిల్ నెగ్గాలంటే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. మరి చూడాలి విరాట్ తన సొంత రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడా? లేదా? మరోవైపు ఐపీఎల్లో 8 వేల పరుగులు పూర్తి చేయడానికి 29 రన్స్ అవసరం. బుధవారం రాజస్థాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే ఈ ఫీట్ సాధించే అవకాశం ఉంది.