Sam Konstas Selfie Effect :బోర్డర్- గావస్కర్లో అందర్నీ ఆకట్టుకున్న ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతడు సిడ్నీ థండర్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 19ఏళ్ల కొన్‌స్టాస్ అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా మరోసారి కొన్‌స్టాస్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కానీ, ఈసారి ఎలాంటి కాంట్రవర్సీ లేదు. అతడితో సెల్ఫీ కోసం ఓ అభిమాని చేసిన పొరపాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రాక్టీస్ కోసం కొన్‌స్టాస్ సిడ్నీ ఒలింపిక్ పార్క్‌కు తన లగేజీతో వెళ్తున్నాడు. అటుగా కారులో వెళ్తున్న ఓ క్రికెట్ ఫ్యాన్ కొన్‌స్టాస్‌ను చూశాడు. తనతో ఎలాగైన సెల్ఫీ దిగాలన్న ఆరాటంలో తన కారును పార్క్ చేసి కొన్‌స్టాస్ కోసం పరుగెత్తాడు. అయితే ఈ హడావుడిలో అతడు కారు హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోయాడు. అంతే పార్కింగ్ ప్లేస్ ఏటవాలుగా ఉండడం వల్ల కారు ముందుకు కదిలింది.
ఇది గమణించిన ఆ వ్యక్తి వెంటనే వెనక్కి పరుగెత్తుతూ వచ్చి కారును అదుపు చేసే ప్రయత్నం చేశాడు. కానీ, అది అప్పటికే ముందున్న కారును మెల్లిగా ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం గాయాలు కాలేదు. చిన్నగా తాకడం వల్ల కార్లు కూడా పెద్దగా డ్యామేజ్ కాలేదు. ఈ దృష్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోను కొన్‌స్టాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిడ్నీ థండర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.