Ind vs Ban Shakib Al Hasan :టీమ్ఇండియాను తమ సొంత గడ్డపై ఓడించడం ఏ జట్టుకైనా అంత సులువు కాదని బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. ప్రస్తుత పర్యటనలో తొలి మ్యాచ్‌లో నిరాశ ఎదురైందని, రెండో టెస్టులో తమ జట్టు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు. భారత్‌తో రెండో టెస్టుకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న షకీబ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
భారత్‌ని ఓడించడం అసాధ్యం!
భారత్ బలాన్ని షకీబ్ ఇతర జట్లతో, ముఖ్యంగా పాక్‌తో పోల్చాడు. 'పాకిస్థాన్ జట్టుకు టెస్టుల్లో పెద్దగా అనుభవం లేదని నేను భావిస్తున్నాను. వారితో పోలిస్తే మాకే ఎక్కువ అనుభవం ఉంది. వాళ్ల కంటే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాము. టెస్టు క్రికెట్లో ఇదే కొలమానం. ఇక టీమ్ఇండియా విషయానికొస్తే, ప్రపంచ నెం.1 జట్టుగా కొనసాగుతోంది. కొంతకాలంగా భారత్ తమ సొంత గడ్డపై ఓటమి లేకుండా దూసుకెళ్తోంది' అని షకీబ్ పేర్కొన్నాడు.
'ఏ దేశానికైనా భారత్‌ని ఎదుర్కోవడం కష్టమైన పని. మాకు కూడా అంతే. దానికి మేం భిన్నం కాదు. ఇలాంటి పటిష్ఠమైన జట్లను ఎదుర్కొంటున్నప్పుడు ఇంకా బాగా ఆడాల్సి ఉంటింది. ఈ రోజుల్లో భారత్ పర్యటన అత్యంత క్లిష్టమైందని భావిస్తున్నాను. ఇతర జట్లు ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో ఓడడం చూశాం. కానీ, టీమ్ఇండియా సొంతగడ్డపై టెస్టుల్లో ఓడిపోవడం చాలా అరుదు' అని వివరించాడు.