Cricketer Venkatesh Prasad On Sankrantiki Vasthunnam :టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్‌గా ఉంటాడు. తరచూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుంటాడు. ఆన్లైన్లోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తుంటాడు. అలా రీసెంట్గా ఫ్యాన్స్‌తో ముచ్చటించిన వెంకటేశ్ ప్రసాద్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'సంక్రాతికి వస్తున్నాం' గురించి మాట్లాడాడు. మరి అతడు ఏమన్నాడంటే?
వెంకటేశ్ ప్రసాద్ తాజాగా ట్విట్టర్లో 'ప్రస్తుతం ఎయిర్ పోర్ట్‌లో ఖాళీగా ఉన్నా. ఎవరైనా కాసేపు ఏమైనా అడగాలంటే అడగండి '#AskVenky'' అంటూ ట్వీట్ చేశాడు. అయితే '#AskVenky' అని ఉండడంతో ఓ నెటిజన్ అతడిని హీరో వెంకటేశ్ అని భావించినట్లున్నాడు! 'సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం సాధించినందుకు మీకు అభినందనలు సర్, మీ నుంచి ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని ఆశిస్తున్నా' అని రాస్తూ, వెంకటేశ్ ప్రసాద్ అకౌంట్‌కు ట్యాగ్ చేశాడు.
దీనికి వెంకటేశ్ ప్రసాద్ స్పందించాడు. 'రఘు, నేను ఆ వెంకటేశ్ కాదు. కానీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి నేను కూడా బాగానే విన్నాను' అని రిప్లై ఇచ్చాడు. దీనికి ఫన్నీ ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. 'తెలుగోళ్లా మజాకా' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.