తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ - పాక్ మ్యాచ్​ : 60ఏళ్ల తర్వాత చరిత్రాత్మక పోరుకు వేళాయె - డేవిస్ కప్ 2024

Davis Cup India Pakistan : 60 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై భారత్ జట్టు అడుగుపెట్టింది. డేవిస్‌ కప్‌ సమరంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఆ వివరాలు.

భారత్ - పాక్ మ్యాచ్​ : 60ఏళ్ల తర్వాత చరిత్రాత్మక పోరుకు వేళాయె
భారత్ - పాక్ మ్యాచ్​ : 60ఏళ్ల తర్వాత చరిత్రాత్మక పోరుకు వేళాయె

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 7:16 AM IST

Davis Cup India Pakistan : భారత్‌ - పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా అభిమానులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. క్రికెటే కాదు ఇరు జట్ల మధ్య ఆట ఏదైనా సరే ఉద్వేగం, ఆ ఉత్సాహం దాదాపు ఒకేలా ఉంటుంది. అలాంటిది పాకిస్థాన్​ గడ్డపై సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ ఆడుతుంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కచ్చితంగా మజాను ఇస్తుంది. అయితే ఇప్పుడు డేవిస్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నీ కోసం చాలా ఏళ్లు తర్వాత పాకిస్థాన్​తో సమరానికి సై అంటోంది భారత్‌.

వివరాళ్లోకి వెళితే. పాకిస్థాన్‌లో భారత్‌ టెన్నిస్‌ జట్టు అడుగుపెట్టి దాదాపు 60 ఏళ్లైంది! ఎందుకంటే రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల కారణంగా చాలా ఏళ్లుగా ఆ దేశానికి భారత్​ వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు పాక్​ గడ్డపై డేవిస్‌ కప్‌ సమరంలో పాల్గొనేందుకు రెడీ అయింది. ప్రపంచ గ్రూప్‌-1 పోరులో భాగంగా ఇస్లామాబాద్‌ వేదికగా 3-4 తేదీల్లో పాకిస్థాన్​తో తలపడనుంది. ఇప్పటివరకు ఆ జట్టుతో ఏడుసార్లు తలపడిన భారత్‌ ఒక్కసారి కూడా పరాజయాన్ని అందుకోలేదు.

దీంతో గ్రాస్‌ కోర్టులో జరుగుతున్న ఈ పోరులో ఇప్పుడు భారతే ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. మొదటి రోజు రామ్‌కుమార్‌ రామనాథన్‌కు తోడు శ్రీరామ్‌ బాలాజీ సింగిల్స్‌లో తలపడనున్నాడు. నికీ పూంచా రూపంలో మరో సింగిల్స్‌ ప్లేయర్‌ అందుబాటులో ఉన్నప్పటికీ గ్రాస్‌ కోర్టులో అతడి కన్నా బాలాజీనే మెరుగని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావించింది.

ఇకపోతే పాకిస్థాన్‌ను మరీ కొట్టి పారేయలేం. అసిమ్‌ ఖురేషి, అకీల్‌ ఖాన్‌ రూపంలో ఆ జట్టులో అనుభవజ్ఞులైన ప్లేయర్స్​ ఉన్నారు. శనివారం తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌తో అసిమ్‌ ఖురేషి, రెండో సింగిల్స్‌లో శ్రీరామ్‌ బాలాజీతో అకీల్‌ ఖాన్‌ పోటీపడనున్నారు.

ఆదివారం డబుల్స్‌లో సాకేత్‌ మైనేని-యుకి బాంబ్రి ద్వయం బర్కతుల్లా-ముజామిల్‌ మొర్తజాతో తలపడనున్నారు. అదే రోజు రివర్స్‌ సింగిల్స్‌లో రామ్‌కుమార్‌తో అకీల్‌, శ్రీరామ్‌తో ఖురేషి తలపడతారు. ఇస్లామాబాద్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్​ను నేరుగా ఎంపిక చేసిన 500 మంది అతిథులు, అభిమానులు మాత్రమే చూడబోతున్నారు. చివరిగా 1964లో పాకిస్థాన్​లో ఆడినప్పుడు భారత్‌ 4-0తో ఘన విజయం సాధించింది. ఇక 2019లో తటస్థ వేదికలో ఆడినప్పుడు ఆఖరిగా అంతే తేడాతో దాయాదిని ఓడించింది.

సెమీస్​లోకి దూసుకెళ్లిన టీమ్ఇండియా- నేపాల్​పై భారత్ 132 పరుగులతో విక్టరీ

'మ్యాచ్​కు రూ.200-300 వచ్చేవి- బ్యాట్ కూడా ఉండేది కాదు' యశస్వి ఎమోషనల్ వీడియో

ABOUT THE AUTHOR

...view details