CSK VS SRH Match Fan : ఐపీఎల్ 17లో భాగంగా శుక్రవారం హైదరబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరును వీక్షించేందుకు అటు ఆరెంజ్ ఆర్మీతో పాటు ధోనీ సేన కూడా స్టేడియానికి బారులు తీరారు. దీంతో మ్యాచ్‌కు ముందు కాస్త ఉద్రిక్తత నెలకొంది. అయితే కాసేపటి తర్వాత అంతా సద్దుమణిగి స్టాండ్స్‌లోకి వెళ్లిపోయారు. తమ తమ సీట్స్‌లో కూర్చుని తమ ఫేవరేట్ ప్లేయర్లను చీర్ చేయడం మొదలెట్టారు. అయితే ఆ తర్వాత ఓ అభిమానికి స్టాండ్స్‌లో ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. టికెట్ బుక్కింగ్ యాప్‌ను రీఫండ్ కోరారు.
ఇంతకీ ఏం జరిగిందంటే ?
జునైద్ అహ్మద్ అనే వ్యక్తి చెన్నై సూపర్ కింగ్స్‌కు వీరాభిమని. ఇక తన ఫేవరట్ టీమ్‌ను సపోర్ట్ చేసేందుకు ఉప్పల్ స్టేడియానికి టికెట్ బుక్ చేశారు. రూ. 4,500 టికెట్‌ను ఆయన కొనుగోలు చేశారు. తీరా స్టాండ్స్‌లోకి వెళ్లేసరికి తనకు కేటాయించిన J 66 సీట్ కనిపించలేదు. దీంతో ఆయన చాలా సేపు నిల్చోవాల్సి వచ్చిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. తనకు రీఫండ్ కావాలని డిమాండ్ చేశారు. అయితే ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత ఆ సీట్ కోసం వెతకగా, అది 'J' రో లోని 69-70 సీట్ల పక్కన కనిపించింది. దీంతో జునైద్ వాపోయారు. ఇలా జరుగుతుందని అస్సలు ఉహించలేదంటూ పేర్కొన్నారు.