CSK vs PBKS IPL 2024:IPL 2024 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరో విజయం నమోదు చేసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో నెగ్గింది. చెన్నై నిర్దేశించిన 168 లక్ష్య ఛేదనలో పంజాబ్ 139-9 పరగులకే పరిమితమైంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (30 పరుగులు), శశాంక్ సింగ్ (27 పరుగులు) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3, సిమ్రన్‌జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే చెరో 2, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
168 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ తొలి నుంచే తడబడింది. రెండో ఓవర్లోనే జాని బెయిర్ స్టో (7) దేశ్‌పాండే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రొసో (0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అలా ఒకే ఓవర్లో దేశ్‌పాండే రెండు వికెట్లు పడగొట్టి పంజాబ్‌ను దెబ్బతీశాడు. ఇక మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (30 పరుగులు) కాసేపు శశాంక్ సింగ్ (27 పరుగులు)తో కలిసి పోరాడాడు. కానీ, 7.6 వద్ద శాంట్నర్ శశాంక్‌ను వెనక్కిపంపాడు. దీంతో 53 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
జడ్డూ మ్యాజిక్:ఈ సమయంలో బంతి పట్టిన జడ్డూ మ్యాజిక్ చేశాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత 12వ ఓవర్లో శామ్ కరన్ (7), అశుతోష్ శర్మ (3)ను పెవిలియన్ చేర్చి పంజాబ్‌ను తీవ్రంగా దెబ్బకొట్టాడు. ఆ తర్వాత హర్షల్ పటేల్ (12), రాహుల్ చాహర్ (16) కూడా ఔటయ్యారు. దీంతో పంజాబ్ 7వ ఓటమి మూటగట్టుకుంది.