CSK VS MI IPL 2024 : ఐపీఎల్లో భాగంగా మరో హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కీలక జట్లైన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ నేడు (ఏప్రిల్ 14)న తలపడనున్నాయి. ఇరు జట్లు ఐపీఎల్ లో ఇప్పటికే ఐదు సార్లు విజేతగా నిలిచాయి. ఈ క్రమంలో దిగ్గజ జట్ల మధ్య ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుండడం వల్ల క్రికెట్ ఫ్యాన్స్ భారీ స్కోరు ఖాయమని అంటున్నారు. కచ్చితంగా చెన్నై, ముంబయి మధ్య పోరు చూడాల్సిందేనని చెబుతున్నారు.
ఇప్పటికే ఐదు మ్యాచ్ ల్లో మూడు గెలిచి చెన్నై మంచి ఊపులో ఉంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అలాగే ముంబయి ఇండియన్స్ కూడా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి జోష్‌లో ఉంది. పాయింట్ల పట్టికలో చెన్నైతో పోల్చితే ముంబయి వెనకబడినా ఆ జట్టునూ అంత తక్కువ అంచనా వేయలేం. అయితే ఇరు జట్ల నుంచి పెద్ద ప్లేయర్లు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు.
1. రోహిత్ శర్మ vs ముస్తాఫిజర్ రెహమాన్
ఈ ఐపీఎల్లో 167.64 స్ట్రైక్ రేట్ తో ముంబయి ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 31.20 సగటుతో 17 ఫోర్లు, పది సిక్సర్ల బాది 156 పరుగులు చేశాడు. చెన్నైతో జరిగే మ్యాచ్ లో కూడా రోహిత్ పవర్ ప్లేలో మరోసారి విధ్వంసం సృష్టిస్తాడని క్రికెట్ ప్రియులు అంచనా వేస్తున్నారు. కానీ CSK బౌలర్ ముస్తాఫిజర్ రెహమాన్ రోహిత్‌ను అడ్డుకుంటాడని అంటున్నారు. ముస్తాఫిజర్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 8 ఎకానమీతో తొమ్మిది వికెట్ల పడగొట్టాడు.
2. జస్ప్రీత్ బుమ్రా vs శివమ్ దూబే
ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ బౌలర్లలో ఒకరిగా ముంబయి పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒకరు. అతడి యార్కర్లకు స్టార్ బ్యాట్స్మెన్లు సైతం పెవిలియన్ బాట పడతారు. ఇటీవల ఆర్సీబీతో ముంబయి తలపడిన మ్యాచ్‌లో బుమ్రా 21 పరుగులు ఇచ్చి 5వికెట్లు పడగొట్టాడు. మెగా టోర్నీలో ఇప్పటివరకు బుమ్రా పది వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లేలో కొత్త బంతిలో, డెత్ ఓవర్లలో యార్కర్లతో CSK బ్యాటర్‌లను బుమ్రా ఇబ్బంది పెట్టొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, చెన్నై బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే ఈ సీజన్ లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. 160 స్ట్రైక్ రేట్‌తో 176 పరుగులు చేశాడు ఈ యంగ్ ప్లేయర్. దూబే- బుమ్రాల మధ్య పోరు కూడా ప్రేక్షకుల్లో ఈ సారి ఆసక్తికరంగా మారింది.