Cricketers Holi Celebrations :దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే పిల్లలు, పెద్దలు అంతా కలిసి రంగుల పండగను ఆహ్లాదంగా జరుపుకొన్నారు. ఐపీఎల్ తొలి దశ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ హోలీ రంగుల్లో స్టార్ క్రికెటర్లు తడిసి ముద్దయారు. సరదాగా కాసేపు సేద తీరారు. ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సహచరులతో కలిసి రంగలు పూసుకుంటూ సందడి చేశాడు. చిన్నపిల్లాడిలా అయిపోయి తన జట్టు సభ్యులతో సందడి చేశాడు. ఇక రోహిత్‌తో పాటు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఇలా అందరూ కలిసి సరదాగా ఆడుకున్నారు.
మరోవైపు ఐపీఎల్‌లోని మిగతా ఫ్రాంచైజీలు కూడా హోలీ పండుగను గ్రాండ్‌గా జరుపుకున్నాయి. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఇలా అన్ని టీమ్స్ ప్లేయర్స్ రంగుల్లో తడిసి ముద్దయ్యారు. ఇక విదేశీ ప్లేయర్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ కనిపించారు.
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కిరిన్ పొలార్డ్ ఇలా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డీజే బ్రావో కూడా ఓ హోలీ ఈవెంట్లో పాల్గొన్నాడు. అక్కుడున్న అభిమానులతో కలిసి ఆడిపాడి అలరించాడు. మరికొంత మంది క్రికెటర్లు తమ ఫ్యామిలీలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, ముంబయి ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ఇలా పలువురు తమ కుటుంబ సభ్యులతో సంబరాలు చేసుకున్నారు.