Robin Uthappa Arrest Warrant : ప్రావిడెంట్ ఫండ్ విషయంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అరెస్ట్‌కు వారెంట్ జారీ అయ్యింది. తాజాగా పులకేశినగర్ పోలీసులు రంగంలోకి దిగి ఊతప్పను అరెస్ట్ చేసేందుకు సిద్దమయ్యారు.
ఏం జరిగిందంటే?
బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి రాబిన్ ఉతప్ప డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల నుంచి పీఎఫ్‌ను కట్ చేసినప్పటికీ వాటిని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయలేదు. దీంతో మొత్తంగా దాదాపు రూ.23 లక్షలను ఉతప్ప తన ఉద్యోగుల ఖాతాలో జమ చేయకుండా మోసం చేశారంటూ తేలడం వల్ల పీఎఫ్ రీజనల్ కమిషనర్ అతడికి నోటీసులు జారీ చేశారు. అయితే వాటిని అందజేసేందుకు డిసెంబరు 4న పులకేశినగర్‌లోని మాజీ క్రికెటర్ నివాసానికి అధికారులు వెళ్లారు.
అక్కడ అతడు లేకపోవడం వల్ల దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ స్థానిక పోలీసులను ఆదేశించినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు కూడా వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఉతప్పపై తాజాగా అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. డిసెంబరు 27లోగా అతడు బకాయిలు చెల్లించాలని లేదంటే అరెస్టు తప్పదంటూ ఆ వారెంట్‌లో పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఉతప్ప కుటుంబం దుబాయ్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక రాబిన్ ఉతప్ప కెరీర్ విషయానికి వస్తే, టీమ్‌ఇండియా తరఫున 59 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 54 వన్డే ఇన్నింగ్స్‌లో 1,183 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఏడు అర్ధశతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌లోనూ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.