Shardul Thakur 102 Degrees Fever: టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 2024 ఇరానీ కప్ టోర్నీలో ఆడుతున్న శార్దుల్ హై ఫీవర్‌తో బాధపడుతున్నప్పటికీ బ్యాటింగ్‌కు దిగాడు. దీంతో జ్వరం ఎక్కువ కావడం వల్ల మ్యాచ్ అనంతరం శార్దూల్‌ను లఖ్‌నవూలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం శార్దూల్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.
ఇరానీ కప్‌లో భాగంగా ముంబయి- రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రెండో రోజు (బుధవారం) ముంబయి ఆటగాడు శార్దూల్ రోజంతా నీరసంగానే కనిపించాడు. అయినప్పటికీ శార్దూల్ బ్యాటింగ్ చేయడానికి క్రీజులో దిగాడు. 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూనే బ్యాటింగ్ కొనసాగించాడు. 59 బంతులు ఎదుర్కొని 36 పరుగులతో రాణించాడు. ఇక ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత జ్వరం మరింత పెరగడం వల్ల ముంబయి మేనేజ్మెంట్ శార్దూల్‌ను హాస్పిటల్లో జాయిన్ చేసింది.
శార్దూల్‌కు డెంగీ, మలేరియా వంటి పరీక్షలు నిర్వహించారు. టెస్టులకు సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత మూడో రోజు అతడిని ఆడించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని ముంబయి జట్టు వర్గాలు పేర్కొన్నాయి.