Cricketer Brand Endorsement :భారత్‌లో క్రికెట్ ఉండే క్రేజే వేరు. ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఏవైనా అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. అందుకే ప్రముఖ కంపెనీలు క్రికెటర్లను తమ బ్రాండ్ అంబాసిడర్లగా నియమించేందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తుంటాయి. ఈ క్రమంలో భారత ఆటగాళ్లలో మొదట బ్రాండ్ ఎండార్స్మెంట్ డీల్ కుదుర్చుకున్నది ఎవరు? అత్యంత ఖరీదైన డీల్ ఏది? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తొలి బ్రాండ్ అంబాసిడర్
టీమ్ఇండియా తొలి కెప్టెన్‌గా సీకే నాయుడు భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించాడు. సీకే నాయుడు 1941లో బాత్ గేట్ లివర్ టానిక్ అనే బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉన్నాడు. దీంతో ఓ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా నిలిచిన తొలి వ్యక్తిగా సీకే నాయుడు నిలిచాడు. ఈ ఎండార్స్మెంట్ డీల్ దేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగింది.
అత్యంత ఖరీదైన డీల్
భారత దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ బ్రాండ్ ఎండార్స్ మెంట్ ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించేవారు. ఈ తరం క్రికెటర్లు కూడా బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా భారీ మొత్తంలో అర్జిస్తున్నారు. అందులో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. వికాట్ బ్రాండ్ ఎండార్స్మెంట్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు. విరాట్ కోహ్లీ 2017లో ప్యూమా (PUMA) కంపెనీతో రూ.110 కోట్ల ఎండార్స్మెంట్ డీల్ కుదుర్చుకున్నాడు. ఇదే భారత క్రికెటర్లు కుదుర్చుకున్న అత్యంత ఖరీదైన డీల్. అలాగే ఎంఆర్ఎఫ్ (MRF)తో 8 ఏళ్లకు రూ.100 కోట్ల ఒప్పందాన్ని చేసుకున్నాడు. అంటే ఏడాదికి సగటున రూ.12.5 కోట్లన్నమాట.