Chennai Super Kings Ipl 2024: 2024 ఐపీఎల్ ఆరంభంలో వరుస విజయాలతో సునాయసంగా ప్లే ఆఫ్స్ చేరుతుందనుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ ఇప్పుడు పోరాడుతోంది. ఈ సీజన్ సెకండ్ హాఫ్‌లో 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు నమోదు చేసింది. ఇక ఓవరాల్‌గా ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇకపై మిగిలిన చివరి రెండు మ్యాచ్‌ల్లో చెన్నై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి సీజన్ ప్రారంభంలో అదరగొట్టిన చెన్నై సెకండ్ హాఫ్‌లో తడబడడానికి గల కారణాలు ఏంటో తెలుసా?
వేధిస్తున్న గాయాలు:చెన్నై జట్టు లయను ఆటగాళ్ల గాయాలు దెబ్బతీశాయి. స్టార్ పేసర్ మతీషా పతిరణా గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడం సీఎస్కేను దెబ్బ కొట్టింది. దీంతో పతిరణా ఐపీఎల్ నుంచి మధ్యలోనే శ్రీలంకకు వెళ్లిపోయాడు. దీపక్ చాహర్ కూడా గాయంతో బాధపడ్డాడు. సిమర్జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్ ఫర్వాలేదనిపిస్తున్నా సీఎస్కే బౌలింగ్ ఇంకా బలహీనంగానే కనిపిస్తోంది!
పేలవమైన ఫామ్:స్టార్ ప్లేయర్లు అజింక్యా రహానే, డేవన్ కాన్వే ఫామ్‌లో లేకపోవడం ప్రతికూలాంశంగా మారింది. ఆల్‌రౌండర్ మోయిన్ అలీ కూడా గుజరాత్‌తో మ్యాచ్‌లో మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక యంగ్ బ్యాటర్ శివమ్ దూబే తొలి ఆరు మ్యాచ్‌ల్లో 163.51 స్ట్రైక్ రేట్‌తో 242 పరుగులు చేశాడు. కానీ, తర్వాతి 6మ్యాచ్‌ల్లో ఏకంగా రెండు డకౌట్లు సహా మూడుసార్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరాడు.