తెలంగాణ

telangana

ETV Bharat / sports

హైబ్రిడ్ మోడల్​లోనే ఛాంపియన్స్ ట్రోఫీ - అధికారికంగా ప్రకటించిన ఐసీసీ - CHAMPIONS TROPHY 2025

హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ - అధికారికంగా ప్రకటించిన ఐసీసీ

Champions Trophy 2025
Champions Trophy 2025 (source Getty Images)

By ETV Bharat Sports Team

Published : Dec 19, 2024, 4:11 PM IST

Updated : Dec 19, 2024, 4:41 PM IST

Champions Trophy 2025 Hybrid Model : ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై కొనసాగుతోన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) తుది నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ఐసీసీ ఆమోదం తెలిపింది. 2024-27 మధ్య ఐసీసీ మ్యాచ్‌లు హైబ్రిడ్‌ మోడల్‌లోనే జరగనున్నాయని వెల్లడించింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లను భారత్‌ తటస్థ వేదికల్లో ఆడనుందని స్పష్టం చేసింది. 2024-27 సైకిల్​లో భారత్ - పాకిస్థాన్, తమ మ్యాచ్​లను తటస్థ వేదికలపై ఆడేందుకు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్​ను ప్రకటిస్తామని వెల్లడించింది.

"2024 నుంచి 2027 వరకు ఇండియా, పాకిస్థాన్​ హోస్ట్ చేసే ఐసీసీ ఈవెంట్స్​లో, ఈ రెండు జట్లు తటస్థ వేదికలపై ఆడేందుకు ఐసీసీ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్ చేసిన ప్రతిపాదనకు ఐసీసీ అంగీకరించింది. త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్​ను ప్రకటిస్తాం. " అని ఐసీసీ తన స్టేట్​మెంట్​లో తెలిపింది. దీంతో, ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు వచ్చే ఏడాది భారత్​లో జరగబోయే మహిళల ప్రపంచ కప్​, 2026లో భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే టీ 20 ప్రపంచకప్​ కూడా హైబ్రిడ్ మోడల్​లోనే నిర్వహించనున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సంబంధించిన తటస్థ వేదిక ఏంటనేది ఐసీసీ వెల్లడించలేదు. దుబాయ్ వేదికగానే భారత్ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

అలానే హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అంగీకరించినందుకు మహిళల వన్డే ప్రపంచకప్ 2028 ఆతిథ్య హక్కులను రివార్డ్‌గా ఇచ్చినట్లు ఐసీసీ పేర్కొంది. 2029-2031 మధ్య జరిగే ఐసీసీ మహిళల టోర్నీని ఆస్ట్రేలియా నిర్వహిస్తుందని పేర్కొంది. కాగా, 2017లో చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగగా, ఫైనల్లో టీమ్​ఇండియాను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ప్రస్తుతం జరగబోయే టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌తో పాటు మొత్తం 8 జట్లు బరిలోకి దిగనున్నాయి.

అసలేం జరిగిందంటే? - భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఐసీసీ, టోర్నీషెడ్యూల్​ ప్రకటనను వాయిదా వేస్తూ వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ జట్టును పాకిస్థాన్‌కు పంపించమని, తమ మ్యాచ్‌లను తటస్థ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ, ఐసీసీని కోరింది. తమ ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని చెప్పింది.

అయితే హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించేందుకు మొదట్లో పీసీబీ అంగీకరించలేదు. తమకు తీవ్ర నష్టం జరుగుతోందని వాదించింది. తమకు నష్ట పరిహారంతో పాటు భారత్ వేదికగా జరిగే టోర్నీలను కూడా హైబ్రిడ్​ మోడల్​లోనే నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఫైనల్​గా ఈ విషయంలో ఐసీసీ, మధ్యవర్తిత్వం చేసింది. అలా సుదీర్ఘ చర్చలు, సమావేశాల అనంతరం ఐసీసీ తాజాగా తుది నిర్ణయం తీసుకుంది.

మహిళా జర్నలిస్ట్​తో కోహ్లీ వాగ్వాదం! - ఎందుకంటే?

చెన్నైకి చేరుకున్న అశ్విన్- ఇంటి వద్ద గ్రాండ్​ వెల్​కమ్

Last Updated : Dec 19, 2024, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details