Jasprit Bumrah Injury :టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి వల్ల ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. బుమ్రా స్థానంలో యువ బౌలర్ హర్షిత్ రాణాకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. అయితే గత కొంతకాలంగా ఎన్‌సీఏ పర్యవేక్షణలో ఉన్న బుమ్రా కోలుకున్నాడట. అలాగే మెడికల్ రిపోర్టులు బాగానే ఉన్నాయట. అయినప్పటికీ టీమ్ఇండియా సెలక్షన్ కమిటీ అతడిని దూరం పెట్టింది. ఈ వార్త తెలిసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మెడికల్ రిపోర్ట్ ఓకే ఉన్నప్పటికీ బుమ్రాను ఎందుకు తీసుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి ఓ కారణం ఉంది. అదేంటంటే?
మెడికల్ రిపోర్ట్ ఓకే!
'బుమ్రా ఐదు వారాలపాటు ఎన్‌సీఏ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. కండిషనింగ్ కోచ్ రజనీకాంత్, ఫిజియో తులసి మార్గదర్శకత్వంలో రిహాబిటేషన్ పూర్తి చేసుకున్నాడు. దీనిపై ఎన్‌సీఏ చీఫ్ నితిన్ పటేల్ బీసీసీఐకి బుమ్రా ఆరోగ్య పరిస్థితిపై ఓ నివేదిక పంపాడు. అందులో బుమ్రా నేషనల్ క్రికెట్ ఆకాడమీలో రిహాబిటేషన్ పూర్తి చేసుకున్నాడని ఉంది. అలాగే బుమ్రా మెడికల్ రిపోర్ట్ బాగానే ఉందని నితిన్ పేర్కొన్నారు'
'కానీ, టోర్నమెంట్ ప్రారంభమయ్యే సమయానికి బుమ్రా బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా ఉంటాడో లేదో తేల్చలేకపోయాడు. ఈ కారణంగానే సెలెక్టర్లు ఎటువంటి రిస్క్ తీసుకోలేదు. దీంతో బుమ్రాపై తుది నిర్ణయాన్ని ఎన్‌సీఏ చీఫ్ అజిత్ అగార్కర్‌కు వదిలేశాడు. అయితే ఫిట్‌గా లేని ఆటగాడిని ఎవరు కూడా జట్టులోకి తీసుకునే రిస్క్ చేయరు. వైద్య బృందం పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే సెలక్షన్ కమిటీ రిస్క్ తీసుకోదు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
అంటే మెడికల్ రిపోర్ట్ బాగానే ఉన్నప్పటికీ, టోర్నీ ప్రారంభానికి బుమ్రా బౌలింగ్ వేయడం అనుమానమే. అయినప్పటికీ జట్టులోకి తీసుకున్నా టోర్నీలో గాయం తీవ్రత పెద్దది అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ విషయంలో సెలక్షన్ కమిటీ ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని భావించి బుమ్రాను ఎంపిక చేయలేదు!