Bumrah Border Gavaskar Trophy :2024 బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో 10.90 సగటుతో 21 వికెట్లు నేలకూల్చాడు. ఆతిథ్య ఆస్ట్రేలియా బౌలర్లు కూడా ఈ స్థాయి ప్రదర్శన చేయకపోవడం గమనార్హం. ఈ సిరీస్‌లో బుమ్రానే నెం 1 బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్‌కు అతడే వెన్నుముకలా ఉన్నాడు.
అయితే టీమ్ఇండియా బౌలింగ్ దళంలో అతడికి సహకారం కరవైంది. జట్టులో మిగతా బౌలర్ల నుంచి బుమ్రాకు ఎలాంటి సహకారం అందడం లేదు. మరి సిరీస్ గమనాన్ని నిర్దేశించే నాలుగో టెస్టులో అయినా సహచర బౌలర్లు పేస్ దళపతికి అండగా నిలుస్తారా? అనేది అభిమానల్లో ఆందోళన కలిగిస్తోంది.
తేడా స్పష్టం
ప్రస్తుత సిరీస్‌లో బుమ్రా 21 వికెట్లతో టాప్‌లో కొనసాగుతుండగా, మిగిలిన టీమ్ఇండియా బౌలర్లలో 3 మ్యాచ్‌ల్లో సిరాజ్ 13 వికెట్లు, 2 మ్యాచ్‌ల్లో హర్షిత్ రాణా 4 వికెట్లు, ఒక మ్యాచ్ ఆడిన ఆకాశ్ దీప్ 2 వికెట్లు పడగొట్టాడు. అంటే ఈ ముగ్గురి వికెట్లు కలిపినా 19 మాత్రమే అవుతాయి. దీన్ని బట్టే బుమ్రా టీమ్ఇండియాకు ఎంత కీలకంగా మారాడో అర్థం చేసుకోవచ్చు.
ఒక్కడి పోరాటం!
తొలి టెస్టులో బుమ్రా అత్యత్తమ ప్రదర్శన వల్లే భారత్ నెగ్గింది. ఆ మ్యాచ్‌లో బుమ్రాకు మిగతా బౌలర్ల నుంచి కాస్త సహకారం లభించింది. కానీ, రెండో టెస్టులో హెడ్‌ను భారత్ ఆపలేకపోయింది. ఓ ఎండ్‌లో బుమ్రా ఒత్తిడి పెంచినప్పటికీ, మిగతా బౌలర్లు రాణించలేకపోయారు. ఇక మన బ్యాటర్లూ విఫలమవడం వల్ల ఆ మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి తప్పలేదు.