BUCHI BABU CRICKET TOURNAMENT : తమిళనాడు వేదికగా ప్రతిష్టాత్మకమైన దేశవాళీ బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్ ఆగస్టు 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ దేశవాళీ టోర్నీలో భారత స్టార్ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆడుతున్నారు. ఇతర ఆటగాళ్లు కూడా అదిరే ప్రదర్శనలు చేస్తున్నారు. దీంతో బుచ్చిబాబు టోర్నీ ఈ సారి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే అసలు ఎవరీ బుచ్చిబాబు అని తెలుసుకునేందుకు చాలా మంది క్రికెట్ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు.
పక్కా తెలుగువాడు! - భారత్‌లో క్రికెట్ అంటే ఒక మతం. క్రికెట్‌ను అభిమానించే వారి సంఖ్య దేశంలో కోట్లలో ఉంది. అలాంటి క్రికెట్‌లో ఎందరో దిగ్గజాలు తమ మార్క్‌ను చాటారు. మరెంతో మంది క్రికెట్‌ను విస్తరించేందుకు కృషి చేశారు. అలాంటి వారిలో బుచ్చిబాబు ఒకరు. ఆయనే దక్షిణ భారత క్రికెట్ పితామహుడు. స్వాతంత్య్రానికి ముందు దక్షిణ భారతదేశంలో క్రికెట్‌ను ప్రోత్సహించడానికి బుచ్చిబాబు చాలా కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగానే నేడు క్రికెట్‌లో దక్షిణ భారతదేశం ఎంతో సాధించింది. ఎందరో క్రికెటర్లను భారత క్రికెట్ జట్టుకు అందించింది. బుచ్చిబాబు తెలుగు వ్యక్తే. ఆయన పూర్తి పేరు మోతవరపు వెంకట మహిపతి నాయుడు. 1868లో బుచ్చిబాబు ఉన్నత కుటుంబంలో జన్మించారు. బుచ్చిబాబు కుటుంబం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వంతో వ్యాపార లావాదేవీలు నిర్వహించేది.
క్రికెట్ దిశగా అడుగులు -ఆటలంటే అమితాసక్తి చూపించే బుచ్చిబాబు, అప్పట్లో బ్రిటీషర్లు ఆడే క్రికెట్ వైపు ఆకర్షితులు అయ్యారు. అయితే మద్రాస్ క్రికెట్ క్లబ్‌లో భారత ఆటగాళ్ల పట్ల చూపుతున్న వివక్ష బుచ్చిబాబును ఆవేదనకు గురి చేసింది. దీంతో ప్రత్యేకంగా క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు. 1888లో మద్రాసులో మద్రాస్ యునైటెడ్ క్రికెట్ క్లబ్ స్థాపించారు. ఆటగాళ్లకు అవసరమైన మెళకువలు చెప్పేలా, బుచ్చిబాబు వారికి దుస్తులు, క్రీడా వస్తువులు సైతం అందించేవారు. స్థానిక క్రీడాకారులు, బ్రిటీష్ క్రికెటర్ల మధ్య మ్యాచ్ జరగాలని ఆయన కలగన్నారు. అయితే బుచ్చిబాబు ఆ కల నెరవేరకుండానే కాలం చేశారు. ఆయన హఠాన్మరణం తర్వాత 1908లో తొలిసారి ఈ మ్యాచ్ జరిగింది. ఆయన స్మారకార్థం ఈ టోర్నమెంట్‌కు బుచ్చి బాబు నాయుడు స్మారక టోర్నీగా పేరు పెట్టారు. ఇక అప్పటి నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతోంది. అలానే బుచ్చిబాబును ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ క్రికెట్ అని కూడా పిలిచేవారు.