IND VS AUS Virat Kohli Records :సొంతగడ్డపై కివీస్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (2024-25)లో టీమ్ ఇండియాకు ఇదే చివరి సిరీస్. ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. అయితే ఈ సిరీస్లో టీమ్ ఇండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 8 రికార్డులపై ఓ లుక్కేద్దాం.
అత్యధిక పరుగులు -విరాట్ కోహ్లీ మరో 458 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాలో టెస్టు ఫార్మాట్లో అత్యధిక పరుగుల చేసిన భారత ప్లేయర్గా చరిత్రకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై సచిన్ 20 టెస్టుల్లో 1,809 రన్స్ చేశాడు. కోహ్లీ 13 టెస్టుల్లో 1,352 పరుగులు సాధించాడు.
శతకాల రికార్డు - ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఆరు శతకాలు బాదాడు. మరో నాలుగు సెంచరీలు చేస్తే ఇంగ్లాండ్ బ్యాటర్ జాక్ హాబ్స్ను (9 సెంచరీలు) అధిగమిస్తాడు. అప్పుడు ఆసీస్ గడ్డపై అత్యధిక శతకాలు బాదిన విదేశీ ప్లేయర్గా విరాట్ రికార్డుకెక్కుతాడు.
ఒక్క సెంచరీ చేస్తే చాలు - అడిలైడ్ ఓవల్ స్టేడియంలో మరో సెంచరీ చేస్తే విరాట్ ఖాతాలో మరో రికార్డు పడుతుంది. ఇప్పటివరకు కోహ్లీ అడిలైడ్ స్టేడియంలో 11 మ్యాచుల్లో 5 సెంచరీలు బాది జాక్ హాబ్స్తో సమానంగా ఉన్నాడు. మరో సెంచరీ బాదితే అడిలైట్ స్టేడియంలో ఎక్కువ సెంచరీల బాదిన విదేశీ ప్లేయర్గా హాబ్స్ను దాటేస్తాడు.
మరో 4 సెంచరీలు బాదితే - ఆసీస్ పై అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ 110 మ్యాచుల్లో 20 శతాలు బాదాడు. విరాట్ 16 సెంచరీలు చేశాడు. మరో 5 సెంచరీలు చేస్తే సచిన్ రికార్డును విరాట్ బ్రేక్ చేస్తాడు.