తెలంగాణ

telangana

ETV Bharat / sports

బోర్డర్- గావస్కర్ ట్రోఫీ: ఎలా మొదలైంది- ఆ పేరెలా వచ్చింది- 28ఏళ్ల హిస్టరీ ఇదే! - BORDER GAVASKAR TROPHY 2024

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ హిస్టరీ- పేరెలా వచ్చింది- ఎలా మొదలైంది?

Border Gavaskar Trophy 2024
Border Gavaskar Trophy 2024 (Source : Getty Images)

By ETV Bharat Sports Team

Published : Nov 17, 2024, 9:01 AM IST

Border Gavaskar Trophy History :ప్రతిష్ఠాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నవంబరు 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్​లో ఎలాగైనా గెలవాలని టీమ్ఇండియా, ఆసీస్ జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఈ రెండు జట్ల మధ్య టెస్టు క్రికెట్​లో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్​ యాషెస్ సిరీస్​లా (Ashes Trophy) మారిపోయింది. ఈ క్రమంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఎప్పుడు మొదలైంది? దీనికి ఎందుకు ఆ పేరు వచ్చింది? చరిత్ర ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.

అలా మొదలైంది!
బోర్డ‌ర్- గావస్క‌ర్ ట్రోఫీ 1996లో మొద‌లైంది. ఆ ఏడాది ఆస్ట్రేలియా ఏకైక టెస్టు కోసం భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చింది. అప్పుడే ఇటు భార‌త దిగ్గజం సునీల్ గావస్క‌ర్, ఆసీస్ ఆటగాడు అలెన్ బోర్డ‌ర్ పేరిట ఒక సిరీస్ జ‌రిపితే బాగుంటుందని ఇరుదేశాల బోర్డులు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఆల‌స్యం చేయ‌డం ఎందుక‌ని ఆ ఏకైక టెస్టుకు 'బోర్డ‌ర్- గావస్క‌ర్ ట్రోఫీ'గా నామ‌క‌ర‌ణం చేశారు. తొలిసారి జరిగిన ఈ సిరీస్​ను టీమ్​ఇండియా దక్కించుకుంది. అలా మొద‌లైన ఈ సిరీస్​ విజయవంతంగా కొనసాగుతూ వస్తోంది.

దిగ్గజాల గౌరవార్థం
కాగా, ఆసీస్ దిగ్గజం అలన్ బోర్డర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ టెస్టు క్రికెట్​లో తమ జట్లకు విశేష సేవలందించారు. టెస్టుల్లో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు బ్యాటింగ్ మాస్ట్రోల గౌరవార్థం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌కు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ అని పేరు పెట్టారు.

హ్యాట్రిక్ ఆశతో
ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై గ‌తంలో త‌డ‌బ‌డే భార‌త జ‌ట్టు 2017 నుంచి కొత్త చ‌రిత్ర‌కు శ్రీకారం చుట్టింది. కంగారూ జ‌ట్టుకు షాకిస్తూ ట్రోఫీని కైవసం చేసుకుంది. అనంత‌రం 2021లోనూ ఆసీస్‌ను సొంతగడ్డపై చిత్తుగా ఓడించి భారత్​ ట్రోఫీని కైవసం చేసుకుంది. అదే ఊపులో ఆసీస్ గడ్డపై హ్యాట్రిక్ విజ‌యం సాధించేందుకు రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు ప‌ట్టుద‌ల‌తో ఉంది.

స్వ‌దేశంలో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జట్లు పైచేయి సాధిస్తూ వ‌స్తున్నాయి. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భార‌త గ‌డ్డ‌పై 29 మ్యాచ్‌లు జ‌ర‌గ్గా, అందులో టీమ్ఇండియా 18 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా 6 మ్యాచ్​ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక ఆస్ట్రేలియాలో 27 మ్యాచ్‌లు జరగ్గా, ఆసీస్ 14 సార్లు నెగ్గింది. టీమ్ఇండియా ఆరింట్లో గెలిచింది. 7 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

భారత్​దే పైచేయి
కాగా, 1996లో ప్రారంభమైన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియానే పైచేయి సాధించింది. ఇప్ప‌టివ‌ర‌కూ బోర్డ‌ర్- గావస్క‌ర్ ట్రోఫీని 16 సార్లు నిర్వ‌హించారు. అందులో 10 సార్లు భారత్ విజేతగా నిలిచింది. 5సార్లు ఆసీస్ ట్రోఫీని గెలుచుకుంది. ఒక సిరీస్ డ్రాగా ముగిసింది.

'అతడు అలా చేయడమే నా సమస్య' - అలన్ బోర్డర్‌ గురించి గావస్కర్ ఏమన్నారంటే?

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ - కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై మైండ్‌ గేమ్‌ స్టార్ట్

ABOUT THE AUTHOR

...view details