Sam Curran Brother Cricket Debut : తన కుటుంబం నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్న నాలుగో వ్యక్తిగా బెన్ కరన్ నిలవనున్నాడు. ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్లైన సామ్ కరన్, టామ్ కరన్ సోదరుడే బెన్ కరన్. అయితే తన బ్రదర్స్‌లా ఇంగ్లాండ్‌కు కాకుండా జింబాబ్వే తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడనున్నాడు బెన్ కరన్. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు జింబాబ్వే జట్టుకు ఎంపికయ్యాడు.
తండ్రి అడుగుజాడల్లో కొడుకులు
బెన్ కరన్ తండ్రి కెవిన్ కరన్ జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 11 వన్డేలు ఆడిన కెవిన్ 287 పరుగులు చేశాడు. అలాగే 9 వికెట్లు పడగొట్టాడు. 2007-2009వరకు జింబాబ్వే జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. కాగా, తండ్రి కెవిన్ కరన్ అడుగుజాడల్లో నడిచి ముగ్గురు కుమారులు ప్రొఫెషనల్ క్రికెటర్లుగా ఎదిగారు.
సత్తా చాటిన బెన్ కరన్
28 ఏళ్ల బెన్ కరన్ ఎడమచేతి వాటం టాప్ ఆర్డర్ బ్యాటర్. ఆఫ్ స్పిన్నర్ కూడా. 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 34.70 సగటుతో 2,429 పరుగులు చేశాడు. అందులో 4శతకాలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 36 లిస్ట్-ఏ మ్యాచ్ ల్లో 999 రన్స్ బాదాడు. లిస్ట్ ఏ కెరీర్ లో ఒక సెంచరీ, ఎనిమిది అర్ధ శతకాలు చేశాడు.
జింబాబ్వే వన్డే టీమ్‌లో చోటు
2018-2022 వరకు ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ క్లబ్ నార్తాంప్టన్ షైర్ తరపున ఆడాడు బెన్ కరన్. తర్వాత జింబాబ్వేకు వెళ్లి ఆడాడు. అక్కడ వన్డేలు, డొమెస్టిక్ క్రికెట్లో రాణించాడు. దీంతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు.
ఇద్దరు సోదరులు అదుర్స్
బెన్ కుర్రాన్ సోదరులు టామ్ కరన్, సామ్ కరన్ ఇంగ్లాండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడారు. 2019లో వన్డే ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో టామ్ కరన్ సభ్యుడు. 2022 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇంగ్లాండ్ టీమ్‌లో సామ్ కరన్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డును దక్కించుకున్నాడు.