IPL 2025 Mega Auction: 2025 ఐపీఎల్ మెగా వేలం ఈ ఏడాది చివర్లో జరగనుంది. దీనికి ముందు బీసీసీఐ, అన్ని ఫ్రాంఛైజీలతో కీలక అంశాలు చర్చించేందుకు సిద్ధమైంది. మొత్తం పది ఐపీఎల్ ఫ్రాంఛైజీల యజమానులతో జులై 31న సమావేశం కానుంది. ఇందులో ప్రధానంగా ఫ్రాంఛైజీలు వేలానికి ముందు ఎంత మంది ప్లేయర్స్‌ను ఉంచుకోవచ్చు(రిటెన్షన్స్), రైట్ టు మ్యాచ్ (RTM) ఆప్షన్లపై చర్చ జరుగనుంది.
ఫ్రాంచైజీలతో సమావేశానికి సిద్ధం
జులై 31న జరిగే సమావేశానికి సంబంధించి ఐపీఎల్ సీఈఓ అమిన్ గురువారం ఉదయం ఫ్రాంఛైజీ యజమానులకు టెక్స్ట్ మెసేజ్‌లు పంపారని క్రిక్‌బజ్ ఓ నివేదికలో పేర్కొంది. మీటింగ్ వెన్యూ, సమయం తెలియజేసే ఫార్మల్ ఇన్విటేషన్ ఈ మెసేజ్‌లో పంపినట్లు పేర్కొంది. 31న మధ్యాహ్నం లేదా సాయంత్రం సమావేశం జరుగుతుందని అమీన్ చెప్పినట్లు తెలిసింది. దీనికి యజమానులందరూ సమావేశానికి అందుబాటులో ఉంటామని కన్‌ఫర్మ్ చేశారని సమాచారం. కచ్చితమైన వేదిక ఇంకా నిర్థారించనప్పటికీ, ముంబయిలోని వాంఖడే స్టేడియం కాంప్లెక్స్‌లో ఉన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయం క్రికెట్ సెంటర్‌లో మీటింగ్ జరగవచ్చని క్రిక్‌బజ్ తెలిపింది.
2022లో మారిన నిబంధనలు
ఐపీఎల్ 2018 మెగా వేలం సమయంలో ఫ్రాంఛైజీలు ఐదుగురు ఆటగాళ్ల వరకు రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో వేలం నుంచి నేరుగా ముగ్గురు ఆటగాళ్లను, మిగిలిన ఇద్దరిని రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్‌ను ఉపయోగించి తీసుకోవచ్చు. అయితే 2022లో రెండు కొత్త జట్లు, గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్రవేశించాయి. దీంతో నిబంధనలు కాస్త మారాయి. RTM కార్డ్ ఆప్షన్ తొలగించారు. కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.