Teamindia Batting Coach : ఇప్పుడు అందరి దృష్టి టీమ్ ఇండియా సపోర్టింగ్ స్టాఫ్ ఎవరనే దానిపైనే ఉంది. టీమ్ ఇండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను ప్రకటించిన బీసీసీఐ, సహాయక సిబ్బంది ఎంపికలో నిమగ్నమైంది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ పదవీ కాలాలు కూడా టీ20 వరల్డ్ కప్‌తో ముగిశాయి. ఇప్పుడు ఈ మూడు స్థానాలకు బీసీసీఐ ఎవరితో ఎంపిక చేయనుందో! ఇప్పుడు తెలుసుకుందాం.
- బ్యాటింగ్ కోచ్ పదవి ఉండదా?
ఈసారి భారత మాజీ ఓపెనర్ గంభీర్ ప్రధాన కోచ్‌గా రావడంతో సపోర్ట్ స్టాఫ్ స్ట్రక్చర్‌లో కొన్ని మార్పులు ఉండవచ్చు. గంభీర్ సలహా మేరకు బీసీసీఐ 'బ్యాటింగ్ కోచ్' పదవిని తొలగించే అవకాశం ఉంది. బదులుగా, ఈ పదవికి 'అసిస్టెంట్ కోచ్' అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఈ పొజిషన్‌కి భారత మాజీ ప్లేయర్, ముంబయి ఆల్ రౌండర్ అభిషేక్ నాయర్ ఎంపిక కావచ్చని సమాచారం. గంభీర్ స్వయంగా టీమ్ బ్యాటింగ్ బాధ్యతలు చూసుకోనున్నాడు. - మోర్నే మోర్కెల్‌ను సూచించిన గంభీర్
బౌలింగ్ కోచ్ పదవికి కొందరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. భారత మాజీ పేసర్లు లక్ష్మీపతి బాలాజీ, వినయ్ కుమార్, జహీర్ ఖాన్ పేర్లు ప్రచారంలో ఉంది. అయితే బౌలింగ్ కోచ్ పదవికి దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్‌ను కూడా గంభీర్ సిఫార్సు చేశాడని సమాచారం. మరి బీసీసీఐ ఆ సిఫార్సును అంగీకరించిందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. కాగా, ఐపీఎల్‌లో గంభీర్ లఖ్‌నవూ మెంటార్‌గా ఉన్నప్పుడు, మోర్నే మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ అంశాలపై ఓ బీసీసీఐ ఉన్నతాధికారి ఈటీవీ భారత్‌తో మాట్లాడుతూ, ‘సహాయక సిబ్బంది స్థానాలన్నింటికీ అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి BCCI నుంచి ఏదీ ఖరారు కాలేదు. రాబోయే కొద్ది రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయో, చూద్దాం.’ అని అన్నారు.
- సహాయక సిబ్బందికి నో ఇంటర్వ్యూ
ప్రధాన కోచ్ పదవి ఎంపికకు అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజ్పే, సులక్షణ నాయక్‌తో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) రెండు ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇద్దరు అభ్యర్థులు గౌతమ్ గంభీర్, భారత మాజీ ఆల్ రౌండర్ డబ్ల్యూవీ రామన్‌లో గంభీర్‌ను ఎన్నుకుంది. తర్వాత సపోర్ట్ స్టాఫ్‌కు ఎలాంటి ఇంటర్వ్యూలు జరగలేదు. ‘సహాయక సిబ్బంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ స్థానాలను BCCI నేరుగా భర్తీ చేస్తుంది’ అని అధికారి తెలిపారు. ఇకపోతే 2021లో భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు, ద్రవిడ్ సహచరుడు సౌరవ్ గంగూలీ నేరుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.