Will Pukovskis Retirement :ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో ఎంతో టాలెంట్ ఉన్న ప్లేయర్ విల్ పుకోవ్‌స్కీ. ఆస్ట్రేలియా భవిష్యత్ బ్యాటింగ్ స్టార్‌గానూ ఎన్నో ప్రశంసలను అందుకున్నాడు. డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే ఓపెనర్‌గానూ అతడిపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు అతడి ఆటకు కంకషన్ అడ్డుకట్ట వేసింది. తలకు పదే పదే గాయాలవ్వడం వల్ల విల్ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు.
డాక్టర్ల సూచన మేరకు విల్ పుకోవ్‌స్కీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని డెసిషన్ తీసుకున్నాడు! దీంతో అతడి కెరీర్ పూర్తిగా ఇంకా మొదలు కాక ముందే ముగింపునకు వచ్చేసింది. చివరగా విల్ ఈ ఏడాది మార్చిలో షెఫీల్డ్ షీల్డ్‌లో మ్యాచులో కంకషన్‌కు గురయ్యాడు. అతడి హెల్మెట్‌కు బంతి బలంగా తాకింది. దీంతో ఆ తర్వాత సీజన్ మొత్తానికి అతడు దూరమవ్వాల్సి వచ్చింది. ఇక ఇంగ్లాండ్ కౌంటీ జట్టు లీసెస్టర్‌షైర్‌తోనూ అగ్రీమెంట్‌ను కూడా రద్దు చేసుకున్నాడు.
విల్ ఇప్పటివరకు మొత్తంగా 13 సార్లు కంకషన్‌కు గురైనట్లు క్రికెట్ వర్గాల సమాచారం. అంతర్జాతీయ క్రికెట్లో విల్ పుకోవ్‌స్కీ ఇప్పటివరకు కేవలం ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు. అది కూడా 2021లో టీమ్ ఇండియాపై ఆడాడు. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌తో అతడు అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కానీ అదే మ్యాచ్‌లో భుజం గాయం అవ్వడం వల్ల ఆరు నెలలు ఆటకు దూరమయ్యాడు.
గతంలో విక్టోరియా తరపున షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో రెండు ద్విశతకాలు బాదాడు. దీంతో టీమ్‌ఇండియాతో సిరీస్‌కు విల్ సెలెక్ట్ అయ్యాడు. కానీ ఆస్ట్రేలియా - ఎ తరపున ఆడేటప్పుడు కంకషన్‌కు గురయ్యాడు.