IND VS AUS 3rd Test Bumrah Wickets Record : బోర్డర్- గావస్కర్ సిరీస్ గమనాన్ని నిర్ణయించే కీలకమైన మూడో టెస్టులో టీమ్ ఇండియా తడబడుతు ఆడుతోంది. గత రెండు టెస్టుల్లో బ్యాటింగ్‌లో అంచనాలు అందుకోలేకపోయినప్పటికీ, బంతితో రాణించిన భారత్, ఇప్పుడు మూడో మ్యాచ్ బౌలింగ్‌లోనూ పట్టు విడిచింది. ఒక్క బుమ్రా (5/72)నే మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బుమ్రా మూడో రోజు ఆటలో ఓ రికార్డును అందుకున్నాడు.
కపిల్ దేవ్ తర్వాత బుమ్రా - ఆస్ట్రేలియా అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన భారత ప్లేయర్ల జాబితాలో చేరాడు. రెండో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అగ్రస్థానంలో మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ 51 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, బుమ్రా 50 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అనిల్ కుంబ్లే (49), ఆర్ అశ్విన్ (40), బిషాన్ సింగ్ బేడీ (35) వికెట్లను తీసి మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
మూడో రోజు ఆటలో మిచెల్ స్టార్క్‌ను ఔట్ చేసి ఈ 50 వికెట్ల ఘనతను అందుకున్నాడు బుమ్రా. ఈ పేసు గుర్రానికి ఈ మార్క్‌ను టచ్ చేయడానికి 42.82 స్ట్రైక్ రేట్‌తో 19 ఇన్నింగ్స్ పట్టింది. కపిల్ దేవ్ 24.58 యావరేజ్, 61.50 స్ట్రైక్ రేట్‌తో 51 వికెట్లు తీశారు.
అగ్రస్థానంలో బుమ్రా -సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా అగ్రస్థానానికి చేరాడు. ఇప్పటివరకు బుమ్రా 8 సార్లు సేనా గడ్డపై 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ లిస్ట్‌లో బుమ్రా తర్వాత కపిల్ దేవ్ (7 సార్లు) ఉన్నారు.