Ravichandran Ashwin Welcome :క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్‌కు కుటుంబ సభ్యులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రిటైర్మెంట్ ప్రకటన తర్వాత ఆస్ట్రేలియా నుంచి బుధవారం బయల్దేరిన అశ్విన్ గురువారం ఉదయానికి చెన్నైలోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఘన స్వాగతం లభించింది. బ్యాండ్ చప్పుళ్లు, కోలాహాలంతో అశ్విన్‌కు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్, కాలనీ వాసులు లెజెండరీ క్రికెటర్‌కు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. గెటు వద్దకు వెళ్లగానే తన తండ్రి భావోద్వేగంతో అశ్విన్‌ను హత్తుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు. అశ్విన్ రాకతో కాలనీ మొత్తం సందడిగా మారింది.
ఇంటి వద్ద అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. స్థానికుల కోరిక మేరకు తన మాతృభాష తమిళంలోనే మాట్లాడాడు. 'నేను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాను. ఇంకొన్నేళ్లపాటు చెన్నై తరఫున ఆడాలని అనుకున్నా మీరు ఆశ్చర్యపోకండి. ఓ క్రికెటర్‌గా అశ్విన్ అలసిపోలేదు. కానీ, భారత క్రికెటర్‌గా ఆ నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది అంతే' అని అన్నాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటించడం కష్టంగా అనిపించిందా? అన్న ప్రశ్నకు బదులిచ్చాడు. 'అలా కాదు. ఈ నిర్ణయం అనేక మందికి ఓ భావోద్వేగ సందర్భం. కానీ, నాకు ఇది సంతృప్తినిచ్చింది. ఎప్పట్నుంచో నాకు ఈ ఆలోచనలో ఉంది. గబ్బా టెస్టు సమయంలో నాలుగో రోజు అనిపించింది, ఐదో రోజు ప్రకటించా' అని అశ్విన్ తెలిపాడు.