Arshdeep Singh IPL Auction 2025 :టీమ్ఇండియా పేసర్ అర్షదీప్ సింగ్ కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 3వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే కెరీర్లో ఓ అరుదైన ఘనత సాధించాడుయ. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు(92) పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్(90) ను అధిగమించాడు. అలాగే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్‌గానూ అర్షదీప్ నిలిచాడు.
టీ20 ఫార్మాట్లో అదుర్స్!
రెండేళ్ల క్రితం భారత జట్టులోకి వచ్చిన అర్ష్ దీప్, తక్కువ కాలంలోనే నమ్మదగ్గ బౌలర్‌గా మారిపోయాడు. ముఖ్యంగా టీ20ల్లో తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేస్తూ డెత్ ఓవర్ స్పెషలిస్టు బౌలర్‌గా మారిపోయాడు. ఐపీఎల్‌లో ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన ఈ 25ఏళ్ల పేసర్ అంచనాలు అందుకుంటున్నాడు. టీమ్ఇండియాలోకి వచ్చిన రెండేళ్లలోనే టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా అవతరించాడు.
కాసుల వర్షం కురిసేనా?
కాగా, 2019లో అర్షదీప్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతడు పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. గత ఐదేళ్లుగా అదే జట్టుకు ఆడిన అతడిని 2025 మెగా వేలానికి ముందు పంజాబ్ రిలీజ్ చేసింది. దీంతో అర్షదీప్ వేలంలోకి వచ్చాడు. తన బేస్‌ప్రైజ్ రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నాడు.
అయితే ప్రస్తుత టీ20 ఫార్మాట్ క్రికెట్‌లో మేటి బౌలర్‌గా ఉన్న అర్షదీప్ సింగ్ తమ జట్టులో ఉంటే బాగుంటుందనే భావనలో ఫ్రాంఛైజీలు ఉన్నాయి. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయడమే కాకుండా వికెట్లు పడగొట్టే ఈ పంజాబీ పేసర్ కోసం వేలంలో తీవ్ర పోటీ ఉండే ఛాన్స్ ఉంది. పోటీపడి మరీ స్టార్ ఫ్రాంచైజీలు అతడి కోసం బిడ్డింగ్ వేసే అవకాశం ఉంది.