Bumrah vs Konstas :బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సామ్ కొన్‌స్టాస్. ఈ సిరీస్‌లో 19 ఏళ్లకే అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ముఖ్యంగా టీమ్‌ఇండియా స్టార్ పేసర్ బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడడం వల్ల అతడి పేరు మార్మోగింది. రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే అతడిని బుమ్రా బౌల్డ్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు.
అప్పటి నుంచి కొన్‌స్టాస్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. కారణం అతడి ప్రదర్శన కాదు, అనవసరంగా మ్యాచ్‌లో నోరు పారేసుకుంటున్నాడు. టీమ్‌ఇండియా ప్లేయర్‌లను కవ్విస్తున్నాడు. శుక్రవారం ఐదో టెస్టు తొలి రోజు కూడా బుమ్రాతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. భారత్‌లో టెస్టు పర్యటనకి వస్తే కొన్‌స్టాస్‌కి రియాలిటీ ఏంటో తెలుస్తుందని అభిప్రాయపడ్డాడు. కొన్‌స్టాస్ తీరుపై చోప్రా సోషల్ మీడియాలో వేదికగా స్పందించాడు. 'కొన్‌స్టాస్‌ని ఓ టెస్టు సిరీస్‌కు భారత్ తీసుకురండి. మనమేంటో అతడికి చూపిద్దాం' (సొంత ప్రేక్షకుల మధ్య ఆడితే బలం ఉంటుంది అనే ఉద్దేశంలో) అని ఓ పోస్ట్ షేర్ చేశాడు.
సిడ్నీ టెస్టు తొలి రోజు ముగుస్తుందనగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభమైంది. రెండో ఓవర్‌లో బుమ్రా బౌలింగ్ వేయబోతుండగా, స్టైకింగ్లో ఉన్న ఖవాజా ఆగాలంటూ సైగ చేశాడు. అప్పుడు కొన్‌స్టాస్ కలుగజేసుకుని ఆగమని బుమ్రాకి సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. బుమ్రాకి కొన్‌స్టాస్ తీరు నచ్చలేదు, 'నీ సమస్య ఏంటి' అని ప్రశ్నించాడు. ఇంతలో అంపైర్ కలగజేసుకొని ఇద్దరినీ దూరంగా పంపి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.