2025 IPL Suryakumar Yadav: 2025 ఐపీఎల్ రిటెన్షన్స్లో ముంబయి ఇండియన్స్ చురుగ్గా వ్యవహరించిందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్, జస్పీత్ బుమ్రాను ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు. టీమ్ఇండియా టీ20 కెప్టెన్ అయినప్పటికీ, అతడు ఈగో (Ego) పక్కనపెట్టి హార్దిక్ పాండ్య సారథ్యంలో ఆడేందుకు సిద్ధమయ్యాడని మెచ్చుకున్నాడు. అలాగే పేసర్ బుమ్రా అనుకొని ఉంటే వేలంలో రూ.25 కోట్లు దక్కేవని అన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్లో ఆకాశ్ వ్యాఖ్యానించాడు.
'రిటెన్షన్స్లో ముంబయి అద్భుతంగా వ్యవహరించింది. బుమ్రా వేలంలోకి వెళ్లి ఉంటే రూ.25 కోట్లు ధర పలికేవాడు. ఒకవేళ తనకు రూ.25 కోట్లు కావాలని ఏ ఫ్రాంచైజీని అడిగినా ఆలోచించకుండా ఇచ్చేస్తారు. నాకు తెలిసి రిటెన్షన్స్ కంటే ముందు బుమ్రాను ఇతర ఫ్రాంచైజీలు సంప్రదించాయని అనుకుంటున్నా'
'అలాగే ముంబయిలో ప్రస్తుతం సూర్యకుమార్ కెప్టెన్ కాదు. అందుకే ఇతర ఫ్రాంచైజీలు అతడిని కూడా సంప్రదించాయని అనుకుంటున్నా. హార్దిక్ ముంబయికి కెప్టెన్ అయితే, సూర్య టీమ్ఇండియా టీ20 సారథి. అయినప్పటికీ ఎలాంటి ఈగో లేకుండా హార్దిక్ కెప్టెన్సీలో ఆడడానికి సూర్య రెడీ అయిపోయాడు. అది కూడా రూ.16.35 కోట్లకే. అతడు కూడా వేలంలోకి వెళ్లాలనుకుంటే రూ.25 కోట్లు దక్కించుకునేవాడు. అలాగే ఇతర జట్టుకు కెప్టెన్ కూడా అయ్యేవాడు' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.