ICC TWO TIER TEST CRICKET: ఇటీవలే ఆసీస్, టీమ్ ఇండియా మధ్య జరిగిన టెస్టు సిరీస్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. మెల్ బోర్న్, సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులను చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిశాస్త్రి టెస్టుల్లో రెండంచెల (టూ- టైర్) విధానం తీసుకురావాలని వ్యాఖ్యానించాడు. అత్యుత్తమ జట్లు తరచూ తలపడుతూ ఉండాలని, అప్పుడు టెస్టులకు మరింత ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జై షా కూడా టూ-టైర్ విధానంపై ఆసక్తిగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఆ బోర్డులతో జైషా సమావేశం!
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డులతో జైషా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో ఇప్పుడున్న విధానంపై పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దేశాలు తక్కువ మ్యాచ్‌లు ఆడినా ఫైనల్‌కు వస్తున్నాయని, అన్ని టీమ్‌లకు సమానంగా టెస్టులను నిర్వహించాలని కోరుతున్నారు.
టూ-టైర్ విధానం అంటే ఏమిటి?
టూ-టైర్ విధానంలో ప్రదర్శనాపరంగా అత్యుత్తమ జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్థాన్ తరచూ ఎక్కువ టెస్టులను ఆడాలి. ఇప్పుడు ఏటా ఒక్కసారి మాత్రమే తమ దేశాల్లో ప్రత్యర్థులతో తలపడుతున్నాయి ఈ జట్లు. అలా కాకుండా తొలి దశలో ఈ ఆరేడు జట్లు ఒకదానితో మరొకటి ఎక్కువ మ్యాచ్ లను ఆడతాయన్న మాట. ఇక రెండో టైర్ లో మిగిలిన జట్లు బంగ్లాదేశ్, వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ వంటి టీమ్‌లు తమలో తాము తలపడతాయి. ఇక్కడ అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఒకటి లేదా రెండు జట్లకు మాత్రమే టైర్ -1 విభాగంలో స్థానం లభించే అవకాశం ఉంటుంది.
2016లోనే చర్చ
అయితే, టెస్టుల్లో టూ టైర్ విధానంపై 2016లోనే చర్చ జరిగింది. టూ టైర్ విధానాన్ని చిన్న జట్ల బోర్డులు వ్యతిరేకించాయి. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా ఈ విధానాన్ని వ్యతిరేకించారు. టూ టైర్ విధానం చిన్న జట్లకు ఆటను దూరం చేస్తుందని, క్రికెట్ స్ఫూర్తికి సరైంది కాదని అభిప్రాయపడ్డారు. టెస్టుల్లో టూ టైర్ విధానానికి బీసీసీఐ వ్యతిరేకమని తెలిపారు.
'టూ టైర్ విధానంలో పెద్ద దేశాలతో ఆడితే చిన్న దేశాలు ఓడిపోతాయి. చిన్న దేశాల్లో క్రికెట్‌ను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. టూ టైర్ విధానం వల్ల ఆర్థికంగానూ చిన్న జట్లకు నష్టం వాటిల్లుతుంది. చిన్న జట్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందనేది బీసీసీఐ అభిప్రాయం. మేము ప్రపంచ క్రికెట్ ప్రయోజనాల కోసం పని చేయాలనుకుంటున్నాం. అందుకే మా జట్టు అన్ని దేశాలతో ఆడుతుంది' అని అనురాగ్ ఠాకూర్ గతంలో వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా జైషా ఉండడం వల్ల టూ టైర్ విధానంపై బీసీసీఐ ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవచ్చని తెలుస్తోంది.